- రోడ్డుదాటాలంటే 6 కిలోమీటర్లు వెళ్లాల్సిందే
- వందలాది వాహనాల దారులకు ఇబ్బంది
- అండర్‌పాస్ నిర్మించని హైవే అధికారులు
కామారెడ్డి, వెలుగు : భిక్కనూరు మండలం బీటీఎస్ వద్ద నేషనల్ హైవే 44 మీద అండర్‌పాస్ లేకపోవడంతో బస్సులు తదితర హెవీ వెహికల్స్ రోడ్డు దాటాలంటే కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించవలసివస్తోంది. ఇక్కడ చిన్న పాటి బ్రిడ్జి మాత్రమే నిర్మించడంతో కార్లు, ఆటోలు, టూవీలర్లు మాత్రమే వెళ్లగలుగుతున్నాయి.
దోమకొండ, బీబీపేట, గంభీరావుపేట తదితర ప్రాంతాలనుంచి వచ్చే భారీ వాహనాలు మాత్రం కామారెడ్డి వైపు వెళ్లడానికి బీటీఎస్ నుంచి సర్వీస్‌రోడ్డు మీద దాదాపు 3 కిలో మీటర్లు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సివస్తోంది. దీంతో ప్రతిసారి అదనంగా ఆరు కిలోమీటర్లు ప్రయాణించవలసివస్తోందని ప్రయాణీకులు వాపోతున్నారు.
హైవే 44 కామారెడ్డి జిల్లా మీదుగా వెళ్తుంది. హైవే మీద పలు చోట్ల అండర్ పాస్ బ్రిడ్జిలు, సర్వీసు రోడ్లు, యూ టర్న్‌లు ఏర్పాటు చేశారు. భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా వద్ద చిన్న బ్రిడ్జి, కొద్ది దూరంలో యూ టర్న్ పాయింట్ ఏర్పాటు చేశారు. దోమకొండ, బీబీపేట మండలాలతో పాటు, సిద్దిపేట జిల్లా దుబ్బాక తదితర ఏరియాల నుంచి కామారెడ్డి వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర హెవీ వెహికల్స్ ఇక్కడే హైవే మీదకు వస్తాయి. ఇక్కడ చిన్న అండర్ పాస్ బ్రిడ్జి మాత్రమే ఉంది.
Also Read :- రైతులకు అన్యాయం జరగొద్దు
బస్సులు, లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, సరుకుల లోడ్‌తో వెళ్లే వెహికల్స్ చాలా దూరం వెళ్లి యూ టర్న్ తీసుకుంటున్నాయి. ఈ రూట్లో రోజూ 30కిపైగా ఆర్టీసీ బస్సులు, వందలాది ఇతర వాహనాలు తిరుగుతుంటాయి. ఇక్కడే తెలంగాణ యూనివర్సిటీ సౌత్క్యాంపస్కూడా ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్లు బీటీఎస్ దగ్గర బస్సు దిగితే రోడ్డు దాటడానికి నానా అవస్థలు పడుతున్నారు.
అండర్‌పాస్ నిర్మించాలి
బీటీఎస్ వద్ద ఇది వరకు రెండు చోట్ల యూటర్న్లు ఉండేవి. దాదాపు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న యూటర్న్‌ను యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్న కారణంగా కొద్ది నెలల కిందట మూసి వేశారు. దీంతో భారీ వెహికల్స్ భిక్కనూరు సమీపంలోని టోల్ ఫ్లాజా వరకు వెళ్లాల్సివస్తోంది. ఇక్కడ యూ టర్న్ తీసుకొని మళ్లీ బీటీఎస్చౌరస్తా మీదుగానే కామారెడ్డి వైపు వెళ్లాలి. ప్రతి టిప్పుకు 6 కి.మీ. దూరం ఎక్కువవుతోంది. బీటీఎస్చౌరస్తా వద్ద ఇప్పుడున్న చిన్న బ్రిడ్జి స్థానంలో పెద్ద అండర్ పాస్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఈ బ్రిడ్జి నిర్మిస్తే ఆయా ఏరియాల నుంచి వచ్చే వెహికల్స్ హైవే పైకి వెళ్లడం సులువై, దూరభారం తగ్గుతుంది. ప్రమాదాలను కూడా అరికట్టవచ్చు. హైవే మీద ప్రమాదాల నివారణకు జిల్లాలో 44 హైవే మీద నర్సన్నపల్లి, టెకిర్యాల్, పద్మాజీవాడి చౌరస్తాల వద్ద అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించారు. బీటీఎస్ వద్ద కూడా చిన్న బ్రిడ్జిని విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు.