మంత్రిని విమర్శించే అర్హత భూపాల్ రెడ్డికి లేదు 

  • గుమ్మల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు : పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి లేదని నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

మంత్రి కోమటిరెడ్డిపై భూపాల్​రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శనులను తీవ్రంగా ఖండించారు. మంత్రిపై మరోసారి వ్యక్తిగత దూషణలు చేస్తే భూపాల్ రెడ్డిని ఉరికిచ్చి కొడతామని హెచ్చరించారు. క్లాక్ టవర్ లో జరిగిన బీఆర్ఎస్ ధర్నాలో మంత్రి వెంకట్ రెడ్డిపై కంచర్ల ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు అందరికీ ఉంటుందని, కానీ నోటికొచ్చినట్లు మాట్లాడితే బట్టలూడదీసి కొడతామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం మంత్రి వెంకట్​రెడ్డి రూ.350 కోట్లు కేటాయించారని తెలిపారు. ఇప్పటికైనా భూపాల్​రెడ్డి తన భాష మార్చుకోవాలని హితువు పలికారు. డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాజీ ఎంపీపీ సుమన్, కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, మాజీ జడ్పీటీసీలు లక్ష్మయ్య, రాంరెడ్డి, నర్సింగ్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.