
- ఎవరికీ రూపాయి ఇవ్వకుండా 60 వేలకుపైగా ఓట్లు తెచ్చుకున్నా
- కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీబీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ
కరీంనగర్, వెలుగు: తనను ఓడించేందుకు సిద్ధాంతాలు వేరైనా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని ‘కరీంనగర్’ గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. తాను గెలిస్తే మరొక పదిమందిని తయారు చేస్తాననే ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయని అన్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ, సంబంధం లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి పొల్యూట్ చేస్తున్నారనే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించానని, ఓటరుకు ఒక రూపాయి ఇవ్వకుండా 60 వేల పైగా ఓట్లు తెచ్చుకున్నానని చెప్పారు.
తాను బీసీవాదంతో ఎన్నికల్లో నిలబడలేదని, తాను బీఆర్ఎస్ మద్దతు తీసుకోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీకి వణుకు పుట్టించానని, తనను అడ్డుకునేందుకు సీఎం 3 సభలు పెట్టారని గుర్తు చేశారు. తన నామినేషన్ ను అడ్డుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రయత్నించారని ఆరోపించారు. తనను నమ్ముకున్న వ్యక్తుల సమస్యల కోసం భవిష్యత్తులో కొట్లాడుతానని తెలిపారు. తిరిగి ఉద్యోగానికి వెళ్లే ప్రసక్తే లేదని, రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. 7 నెలలుగా తనకోసం కష్టపడిన వారికి ధన్యవాదాలు తెలిపారు.