![నకిలీ పేపర్లతో భూమిని అమ్మిన కేసులో నలుగురి అరెస్టు.. పరారీలో 9 మంది](https://static.v6velugu.com/uploads/2025/02/karimnagar-land-scam-four-arrested-for-selling-land-using-fake-papers_CkOtqsH4ha.jpg)
కరీంనగర్, వెలుగు: నకిలీ పేపర్లు సృష్టించి, తప్పుడు హద్దులు చూపి తమది కాని భూమిని ఇతరులకు అమ్మిన ఘటనలో 13 మందిపై కేసు నమోదు చేసిన కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు శుక్రవారం నలుగురిని అరెస్టు చేశారు. సీఐ కోటేశ్వర్ వివరాల ప్రకారం.. కరీంనగర్ వావిలాలపల్లికి చెందిన బూరుగుపల్లి వెంకటేశ్వరరావు, ఆయన తల్లి సత్యవతికి కట్టరాంపూర్ లోని సర్వేనెంబర్ 954లో 6.18 ఎకరాల భూమి ఉంది. ఇదే సర్వే నంబర్ లో వీరి భూమికి ఆనుకుని రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన పంతంగి రామచంద్రరావుకు(83) 2.06 ఎకరాలుంది. దీంతోపాటు ఇదే నంబర్ లో మరో 2.39 ఎకరాల భూమిని ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద 1978లో ప్రభుత్వం సేకరించింది.
ఈ క్రమంలో వెంకటేశ్వర్ రావు 2002 నుంచి 2022 వరకు పలు దఫాలుగా తన ఆధీనంలో ఉన్న 6.18 ఎకరాల భూమి నుంచి సుమారు 34 మందికి 4 ఎకరాల వరకు అమ్మాడు. మిగతా 2.18 ఎకరాల్లో 1.20 ఎకరాల భూమిని కరీంనగర్ టు సిరిసిల్ల బైపాస్‌కు ప్రభుత్వం తీసుకోగా.. మిగిలిన 38 గుంటల భూమిని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్లాడు. అదేవిధంగా తన భూమిని ఆనుకుని ఉన్న రామచంద్ర రావు 1981 నుంచి 2004 వరకు పలుదఫాలుగా ఏడుగురికి తన భూమి 2.06 ఎకరాల్లో(86గుంటలు) నుంచి సుమారు 75 గుంటలు అమ్మగా 11 గుంటలు మిగిలి ఉంది. ఈ క్రమంలోనే వెంకటేశ్వరరావుకు చెందిన 38గుంటల భూమిని కాజేయాలనే దురుద్దేశంతో 2014లో బల్మూరి రమణారావు, దాసరి బుచ్చి మల్లారెడ్డి, మహమ్మద్ బషీర్ ముఠాగా ఏర్పడి పంతంగి రామచంద్రరావుకు అధిక డబ్బు ఆశచూపారు.
వారితోపాటు 10 మంది కలిసి తప్పుడు పత్రాల ద్వారా ఒకేరోజు సుమారు 41 గుంటలను పార్ట్స్‌గా విభజించుకొని 10 మంది పేరిట తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2022లో బాధితుడు వెంకటేశ్వర్ రావు ఈసీ చెక్ చేసుకోగా ఈ తతంగం బయటపడింది. అంతేగాక నిందితులు నకిలీ పేపర్లు సృష్టించేందుకు ఎస్సారెస్పీ ఆఫీసర్ల నుంచి అక్రమంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు పంతంగి రాంచందర్ రావు, మహమ్మద్ బషీర్, బొల్లవేణి శంకర్, బల్మూరి విజయ్ కుమార్, దేశవాణి శంకర్, మంతెన నర్సయ్య, నందికొండ మురళీధర్ రెడ్డి, దాసరి శ్రీనివాస రెడ్డితోపాటు ఇద్దరు ఇరిగేషన్ అధికారులపై కేసు నమోదు చేశారు. వీరిలో బల్మూరి రమణ రావు, దాసరి సంజీవ రెడ్డి, దాసరి బుచ్చి మల్లా రెడ్డి, మొహమ్మద్ బషీర్ ను అరెస్టు చేయగా మిగిలినవారు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.