క్వాలిటీ టెస్టులు లేకుండానే బిల్లులు పాస్

క్వాలిటీ టెస్టులు లేకుండానే బిల్లులు పాస్
  • కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో  ఏడాదిగా ఇదే తీరు
  • ఏజెన్సీని ఎంపిక చేయడంలో ఆఫీసర్ల నిర్లక్ష్యం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను చెక్ చేయడానికి ఉద్దేశించిన థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ టెస్టులు ఏడాదిగా నిర్వహించడం లేదు. క్వాలిటీ కంట్రోల్ టెస్టులు లేకుండానే బిల్లులు పాస్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. థర్డ్ పార్టీ ఏజెన్సీల ఎంపిక కోసం ఏడాదిలో రెండు సార్లు టెండర్ నోటిషికేషన్ ఇచ్చిన అధికారులు.. ఏజెన్సీని ఫైనల్ చేయడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొందరు రాజకీయ నాయకుల జోక్యంతోనే ఏజెన్సీల ఎంపికలో జాప్యం జరగుతోందనే ప్రచారం జరుగుతోంది. 

బిల్లు పాస్ కావాలంటే క్వాలిటీ టెస్టులు తప్పనిసరి.. 

ఏదైనా ప్రభుత్వ శాఖలో జరిగిన పనులకు పూర్తి బిల్లులు మంజూరు కావాలంటే థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ టెస్టులు చేసి సర్టిఫైడ్ చేయడం తప్పనిసరి. ఆయా శాఖలు ఇందుకోసం స్వతంత్ర ఏజెన్సీలను ఎంపిక చేస్తాయి. ఈ ఏజెన్సీలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ అభివృద్ధి పనుల నాణ్యతను వివిధ దశల్లో అంచనా వేస్తాయి. నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ధారిస్తారు. ఈ టెస్టులు పూర్తయి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ సిఫార్సు చేస్తేనే కాంట్రాక్టర్లకు పూర్తి బిల్లులు మంజూరవుతాయి. లేదంటే బిల్లులు మంజూరు కావు. అభివృద్ధి పనుల్లో కీలకమైన ఈ ఏజెన్సీని ఏడాదిగా ఎంపిక చేయకపోడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా ఏజెన్సీని ఎంపిక చేయలే.. 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ,  ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, భవన నిర్మాణాల తదితర సివిల్ వర్క్స్ లో క్వాలిటీని చెక్ చేసే థర్డ్ పార్టీ ఏజెన్సీ గడువు నిరుడు జనవరిలోనే ముగిసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే గతేడాది ఫిబ్రవరి 13న థర్డ్ పార్టీ ఏజెన్సీ ఎంపికకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ టెండర్ లో ఒకరి కంటే ఎక్కువ మంది బిడ్ వేసినట్లు తెలిసింది. బిడ్డర్లు టెక్నికల్ బిడ్ అర్హత కలిగి ఉన్నప్పటికీ.. అప్పటి పాలకవర్గంలోని కొందరు ప్రజాప్రతినిధుల జోక్యం కారణంగా బిడ్లు తెరవలేదని సమాచారం. 

నిబంధనల ప్రకారం గడువులోగా బిడ్డర్ ను ఫైనల్ చేయకపోతే.. టెండర్ ను వెంటనే రీకాల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆఫీసర్లు అలా చేయకుండ ఈ ఏడాది మార్చి 26న ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ సారి చాలా మంది బిడ్ ను కోట్ చేయడంతోపాటు టెక్నికల్ ఎలిజిబులిటీ సాధించినప్పటికీ ఇప్పటి వరకు బిడ్ ఓపెన్ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఫైనల్ బిల్లు ఆపుతున్నం..

థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ ఎంపిక కోసం మార్చిలో మళ్లీ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చాం. అది ప్రస్తుతం ఎవాల్యూయేషన్ స్టేజీలో ఉంది. కాంట్రాక్టర్లకు 10 శాతం నుంచి 15 శాతం వరకు ఫైనల్ బిల్లులు ఆపుతున్నాం. టెస్టులు తర్వాతైనా చేయొచ్చు. టెస్టులు అయ్యాకే పూర్తి బిల్లు సాంక్షన్ చేస్తాం. - లచ్చిరెడ్డి, డీఈ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్