కరీంనగర్ పోలీస్​ స్టేషన్​ ముందు యువకుడి హత్య

కరీంనగర్ క్రైం, వెలుగు : తాగిన మైకంలో  గొడవపడి  ఓ యువకుడిని‌  దారుణంగా  కొట్టి చంపిన ఘటన కరీంనగర్  వన్ టౌన్  పోలీస్ స్టేషన్ ఎదురుగా గురువారం రాత్రి జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లాకు చెందిన పులగండ్ల  సిసింద్రీ (25)  గత 20 ఏండ్లుగా కరీంనగర్  హౌసింగ్ బోర్డ్ లో నివాసముంటున్నాడు.   సిసింద్రీ మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వన్ టౌన్ స్టేషన్ సమీపంలోని ఉన్న  వైన్స్​షాపు పర్మిట్ రూం లో  గురువారం రాత్రి  లిక్కర్​ తాగుతుండగా ఇక్కడికి కరీంనగర్ మండలం  బొమ్మకల్ కృష్ణానగర్ కు చెందిన లారీ డ్రైవర్ జూపల్లి దత్తారావు వచ్చాడు.   

ఇద్దరూ మందు తాగుతుండగా మాటామాట పెరిగి గొడవకు దిగారు.  సిసింద్రీ అక్కడి నుంచి బయటికి వచ్చాడు. కోపంగా  ఉన్న  దత్తారావు అందరూ చూస్తుండగానే వెనుక నుంచి వచ్చి రాయితో  సిసింద్రీపై దాడి చేయగా అతడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఏసీపీ నరేందర్, సీఐ రవికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సిసింద్రీ వద్ద  ఏటీఎం కార్డు, ఫోన్ మాత్రమే దొరకడంతో వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  శుక్రవారం నిందితుడిని  పోలీసులు అరెస్ట్​ చేశారు.