- సోమవారం వ్రతాలు జరిపించుకున్న 1,271 జంటలు
యాదగిరిగుట్ట, వెలుగు: కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో.. కార్తీక పూజలు జరిపించుకోవడానికి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో.. యాదగిరిగుట్ట ఆలయం కిటకిటలాడింది. దర్శన, లడ్డూప్రసాద క్యూలైన్లు కిక్కిరిశాయి. సత్యనారాయణస్వామి వ్రతాలు జరిపించుకునే భక్తులతో వ్రతమండపాలు, కార్తీక దీపాలు వెలిగించుకునే భక్తులతో దీపారాధన స్టాళ్లలో సందడి నెలకొంది. వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించిన అనంతరం భక్తులు.. శివాలయంలో శివకేశవులకు రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ALSO READ : స్టూడెంట్లు, నిరుద్యోగుల అకౌంట్లలోకి ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్
రద్దీ కారణంగా నారసింహుడి దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. సోమవారం ఒక్కరోజే 1,271 మంది దంపతులు సత్యదేవుడికి వ్రతాలు జరిపారు. వ్రత నిర్వహణ ద్వారా ఆలయానికి రూ.10,16,800 ఆదాయం వచ్చింది. భక్తులు నిర్వహించిన పలు రకాల పూజలు, నిత్య పూజల ద్వారా సోమవారం ఆలయానికి రూ.44,70,794 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.