కరీంనగర్/రాయికల్/ ముత్తారం, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో శుక్రవారం కార్తీక సందడి నెలకొంది. కరీంనగర్‌లోని పాత బజార్ శివాలయంలో, భగత్‌నగర్‌లోని భవానీ ఆలయంలో ఉదయం నుంచే భక్తులు పూజలు చేశారు. రాయికల్ మండలంలోని కొత్తపేట నాగాలయం, రాయికల్ శివాలయం, అల్లీపూర్ శ్రీరాజరాజేశ్వరాలయం ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. నగునూర్‌లోని దుర్గాభవానీ ఆలయంలో జ్వాలాతోరణం నిర్వహించారు. రాయికల్ పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి పంచముఖ లింగేశ్వర ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ముత్తారం మండలం పలు గ్రామాల్లోని ఆలయాల్లో కార్తీక దీపారాధనలు నిర్వహించారు.
వేములవాడలో ఘనంగా జ్వాలాతోరణం
వేములవాడ, వెలుగు: రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని తెల్లవారుజాము నుంచే స్వామి వారి సన్నిధిలోని రావిచెట్టు వద్ద అలాగే ధర్మగుండం వద్ద కార్తీక దీపాలను వెలిగించి నీటిలో వదిలారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వర దేవి అమ్మవార్లతోపాటు శ్రీ అనంత పద్మనాభస్వామివార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అలాగే అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో లింగకారంలో కార్తీక దీపాలను పేర్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో రాత్రి ఆలయ స్థాన చార్యులు శ్రీ అప్పాల భీమా శంకర్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు వేద పండితులు కన్నుల పండువగా జ్వాలాతోరణం నిర్వహించారు. అనంతరం స్వామి వారికి నిశి పూజ మహాపూజ నిర్వహించారు.
20 వేల వొత్తులతో దీపారాధన
సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ పట్టణం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణ లోని శ్రీ సాంబశివ ఆలయంలో శుక్రవారం 20,116 వత్తులతో స్థానిక భక్తుడు పల్లా మహేందర్, సుమ దంపతులు అఖండ దీపారాధన నిర్వహించారు. జిల్లా లైబ్రరీ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి, ఆలయ చైర్మన్ మురళీధర్, పుష్పలత, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.