
- మండలంలో 3,452 మంది నిరక్షరాస్యులకు వాలంటీర్లతో చదువు
- 22 గ్రామాల్లో 30 మంది చొప్పున 660 మందికి టైలరింగ్ శిక్షణ
- అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో నిర్వహణ
- చేయూతనందిస్తున్న ఓరియంట్ సిమెంట్ కంపెనీ
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం వంద శాతం అక్షరాస్యత దిశగా ముందుకు సాగుతోంది. కలెక్టర్ కుమార్ దీపక్ చొరవతో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘100 డేస్ లిటరసీ ప్రోగ్రాం’ను ఇటీవల ప్రారంభించారు. కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద దీనికి దేవాపూర్‌లోని ఓరియంట్ సిమెంట్ కంపెనీ(ఓసీసీ) చేయూతనందిస్తోంది.
అంగన్వాడీ టీచర్లు, డీఆర్డీఏ, ఐకేపీ గ్రూపు మెంబర్స్‌తో పాటు పంచాయతీ సెక్రటరీలను భాగస్వాములను చేశారు. లిటరసీ ప్రోగ్రాంను సక్సెస్ చేసేందుకు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) సబావత్మోతీలాల్ పర్యవేక్షణలో డీఈవో యాదయ్య, అడల్ట్ఎడ్యుకేషన్ఆఫీసర్ పురుషోత్తం, డీఆర్డీవో కిషన్ చర్యలు తీసుకుంటున్నారు.
3,452 మంది నిరక్షరాస్యులు
కాసిపేట మండలంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉండడంతో పాటు ఆ సామాజికవర్గంలో నిరక్షరాస్యులు అధిక సంఖ్యలో ఉండడంతో ఈ మండలాన్ని లిటరసీ ప్రోగ్రాం కోసం ఎంచుకున్నారు. అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులతో మండలంలోని 22 పంచాయతీల పరిధిలో సర్వే నిర్వహించారు.
15 నుంచి 50 సంవత్సరాలున్న 3,452 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. ఇందులో 2,005 మంది మహిళలు, 1,447 మంది పురుషులు ఉన్నారు. వీరు తెలుగు అక్షరమాల, గుణింతాలు, పదాలు, చిన్న వ్యాక్యాలు చదివి అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా బుక్లెట్ రూపొందించారు. పేర్లు రాయడం, కూడికలు, తీసివేతలు నేర్పిస్తున్నారు. నిరక్షరాస్యత కారణంగా నిత్య జీవితంలో మరొకరిపై ఆధారపడకుండా తీర్చిదిద్దుతున్నారు.
ఇటు చదువు.. అటు టైలరింగ్
నిరక్షరాస్యులకు చదువు చెప్పడంతో పాటు మహిళలకు స్వయం ఉపాధి బాటలు వేసేందుకు టైలరింగ్సైతం నేర్పిస్తున్నారు. ఒక్కో గ్రామంలో చదువుకున్న 30 మంది మహిళలను సెలెక్ట్ చేసి వారికి టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వడం, వారు ఒక్కొక్కరు ఐదుగురికి చదువు నేర్పేలా లిటరసీ ప్రోగ్రాంను రూపొందించారు.
ఇలా 22 పంచాయతీల్లో 660 మంది మహిళలకు కుట్టు శిక్షణ అందిస్తున్నారు. టైలరింగ్ నేర్పించడానికి గ్రామానికి ఒక ఇన్స్ట్రక్టర్ను నియమించారు. వీరికి వంద రోజులకు రూ.10 వేల వేతనంతోపాటు ట్రెయినింగ్‌కు అవసరమైన రెండు కుట్టు మెషీన్లు, స్టడీ మెటీరియల్‌ను ఓరియంట్ సిమెంట్ కంపెనీ అందిస్తోంది.
ఐదు గ్రామాల్లో వంద శాతం అక్షరాస్యత
వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలోని ఐదు గ్రామాల్లో ‘100 డేస్ లిటరసీ ప్రోగ్రాం’ అమలు చేశారు. లక్సెట్టిపేట మండలం చందారం, మందమర్రి మండలం నార్లాపూర్, బెల్లంపల్లి మండలం రంగంపేట, దండేపల్లి మండలం ముత్యంపేట, జన్నారం మండలం గోండుగూడ గ్రామాల్లోని 15 నుంచి 50 ఏండ్ల వయసు గల నిరక్షరాస్యులను గుర్తించి వారికి చదువు నేర్పించారు. వలంటీర్లకు ఎన్జీవోల ద్వారా టైలరింగ్శిక్షణ ఇప్పించగా చాలా మంది టైలరింగ్చేస్తూ స్వయం ఉపాధి పొందుతూ కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు.