- రగులుతున్న సీనియర్లు.. ఆశావహుల నారాజ్
- ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కిస్తున్నారంటూ ఫైర్
- సోషల్‌మీడియాలో సొంత పార్టీ నేతల నిలదీతలు
- కౌశిక్‍పై నమోదైన కేసుల వివరాలతో పోస్టింగులు
వరంగల్ రూరల్, వెలుగు: సీనియర్లను కాదని కౌశిక్‍రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై టీఆర్ఎస్ పార్టీలో కుతకుత మొదలైంది. ఉద్యమకారులను మానుకోటలో రాళ్లతో కొట్టించారనే ముద్ర ఉన్న వ్యక్తికి పదవులివ్వడం ఏంటని స్టూడెంట్ జేఏసీలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.ఉద్యమంలో పోరాడిన వారిని, ఏండ్లుగా పార్టీ జెండా మోస్తున్న వారిని వదిలేసి నిన్నగాక మొన్న కారెక్కిన వ్యక్తికి పదవి ఇవ్వడంపై సీనియర్లు రగిలిపోతున్నారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పోస్ట్ జులై 16 న ఖాళీ అయింది. అంతకుముందు జూన్ 3తో ఆరుగురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. వీరంతా మళ్లీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇప్పుడు వద్దంటూ టీఆర్‍ఎస్ పెద్దలే కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాశారు. దీంతో గవర్నర్ కోటాలోని ఒక్క ఎమ్మెల్సీ తప్పించి ఏంలేవు. ఉన్న ఒక్క సీటుకు సీనియర్ల నుంచే విపరీతమైన పోటీ నెలకొంది. అప్పటి వరకు గవర్నర్ కోటాలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న వరంగల్‍కు చెందిన టీఆర్‍ఎస్ పార్టీ స్టేట్ ఆఫీస్ ఇన్చార్జి శ్రీనివాస్‍రెడ్డి మరో అవకాశం కోసం పెట్టుకున్న రిక్వెస్ట్ పక్కనపడేశారు. టీఆర్‍ఎస్‍లో మంత్రి పదవి ఖాయం అనుకొని ఆ రోజుల్లో పార్టీ మారిన గుత్తా సుఖేందర్‍రెడ్డి ఈ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఉద్యోగ సంఘాల మాజీ లీడర్ దేవీప్రసాద్, టీఆర్‍ఎస్ జనరల్ సెక్రటరీ శ్రావణ్‍రెడ్డి, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తమకు చాయిస్ వస్తుందని వెయిట్ చేశారు. నాగార్జునసాగర్ బై పోల్స్ టైంలో పార్టీ క్యాండిడేట్‍ను గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీనియర్ నేత కోటిరెడ్డికి సభా వేదికపైనే సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఆయన ఈ పోస్ట్ తనకే ఇస్తారని ఇన్నాళ్లు నమ్మకంగా ఉన్నారు. టీడీపీ స్టేట్ మాజీ ప్రెసిడెంట్ ఎల్.రమణ ఇటీవల టీఆర్ఎస్లో చేరగా, ఆయనకు అయితే హుజూరాబాద్ టిక్కెట్ లేదంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తారని భావించారు. కరీంనగర్ జిల్లాలో సీనియర్ లీడర్ ఈద శంకర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేస్తానని సీఎం స్వయంగా హామీ ఇచ్చారు. ఇక నల్గొండ జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, సంగారెడ్డి జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ ఎండీ ఫరీదుద్దీన్, నిజామాబాద్ జిల్లాలో మండవ వెంకటేశ్వర రావు, ఆకుల లలిత, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలా ఎంతో మంది సీనియర్లు ఎమ్మెల్సీ పదవి కోసం క్యూలో ఉన్నప్పటికీ పార్టీ పెద్దలకు ఏ ఒక్కరూ కనిపించలేదు.
రాజకీయ వర్గాల్లో.. బిగ్ డిస్కషన్
టీఆర్‍ఎస్ పార్టీలో ఇంతమంది సీనియర్లు, ఉద్యమకారులను కాదని కేవలం పదిరోజుల క్రితం వచ్చిన కౌశిక్‍రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై ఇంట బయట పెద్ద చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీఆర్‍ఎస్‍కు కోవర్ట్ గా పనిచేయడం వల్లే పదవి వచ్చిందని కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‍కుమార్‍రెడ్డి రెకమండేషన్ వల్లే పదవి ఇచ్చారని ఆ పార్టీలో మరో వర్గం ప్రచారం చేస్తోంది. గత హుజూరాబాద్ ఎన్నికల్లో 60 వేల ఓట్లు సాధించిన కౌశిక్‍రెడ్డి అవసరం ఇప్పుడు కారు పార్టీకి ఉన్నందునే పదవి ఇచ్చారని పార్టీ పెద్దలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 20 ఏండ్లుగా పార్టీలో ఉన్నవారిని లెక్కచేయకుండా ఇతర పార్టీలోంచి వచ్చే కొత్త వ్యక్తులకు పార్టీ హైకమాండ్ పదవులు ఇవ్వడంపట్ల సీనియర్ లీడర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఏమాత్రం ఉద్యమ నేపథ్యం, నిలకడ లేని వ్యక్తి, తన కోవర్టు పనులతో కాంగ్రెస్‌లాంటి పార్టీ తరిమికొట్టిన కౌశిక్‌రెడ్డిని పెద్దల సభకు పంపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కౌశిక్‍రెడ్డికి సంబంధించిన కేసులు, ఇతరత్రా వ్యతిరేక సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంలో రూలింగ్ పార్టీ లీడర్లు ప్రతిపక్ష పార్టీలతో పోటీపడుతున్నారు. ఇది టీఆర్ఎస్ హైకమాండ్‌కు ఇబ్బందికరంగా మారిందనే ప్రచారం జరుగుతోంది.