పసుపు రైతును ప్రభుత్వాలు చిత్తు చేస్తున్నయ్ : కవిత

 పసుపు రైతును ప్రభుత్వాలు చిత్తు చేస్తున్నయ్ : కవిత
  • వారి బాధలు సీఎం రేవంత్​కు పట్టవా?: కవిత

హైదరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతులను చిత్తు చేస్తున్నాయని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పసుపు రైతుల బాధలు సీఎం రేవంత్​ రెడ్డికి పట్టవా అని ప్రశ్నించారు. పంటకు గిట్టుబాటు ధర లేక పసుపు రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవడం లేదని మంగళవారం ఓ ప్రకటనలో ఆమె విమర్శించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని నిలదీశారు. పసుపుకు మద్దతు ధరగా క్వింటాల్​కు రూ.15 వేలు ఇస్తామని ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు రూ.9 వేలు కూడా రావడం లేదని విమర్శించారు. 

అయినా కూడా మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. పసుపుబోర్డు తెచ్చామని చెబుతున్న బీజేపీ, ఎంపీ ధర్మపురి అర్వింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని, పసుపుబోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదని అన్నారు. పసుపు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపుబోర్డు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారని, కానీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపించడం లేదన్నారు.