పింక్​ బుక్​ పెట్టినం : కవిత

పింక్​ బుక్​ పెట్టినం  : కవిత
  • మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినోళ్లను వదలం: కవిత
  • కులగణన టోల్ ఫ్రీ నంబర్​పై విస్తృతంగా ప్రచారం చేయాలని డిమాండ్

జనగామ, వెలుగు: కాంగ్రెస్​ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ‘‘మేము కూడా పింక్​ బుక్​ పెట్టినం. మా కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న అందరి లెక్కలు తీస్తున్నం. వచ్చేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమే. ఇంతకు ఇంత తిరిగి చెల్లిస్తం. ఎవరినీ వదిలేది లేదు”అని ఆమె హెచ్చరించారు. గురువారం జనగామ జిల్లా కేంద్రం శివారు యశ్వంతాపూర్​లోని బీఆర్ఎస్​ జిల్లా పార్టీ ఆఫీస్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వేలో మిస్​ అయిన ప్రతీ ఒక్కరూ ఎన్​రోల్​అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్​చేశారు. 

కులగణన టోల్​ ఫ్రీ నంబర్​పై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. బస్టాప్​లపై, మీడియాలో అడ్వర్టైజ్​మెంట్లు వేసి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 16 నుంచి 28 వరకు 15 రోజుల పాటు రీ సర్వే చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారని, అవసరమైతే నెల రోజులు టైం ఇచ్చి పక్కాగా వివరాలు నమోదు చేయించాలన్నారు. 

అదేవిధంగా ఇది వరకే నమోదు చేయించుకున్న వారు కూడా తమ ఉప కులాన్ని చెప్పేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. వరంగల్​ రైతు డిక్లరేషన్​ పై నిలదీస్తారనే రాహుల్​ గాంధీ వరంగల్​ పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్​ లీడర్లు క్యామ మల్లేశ్, సేవెల్లి సంపత్, కందుకూరి ప్రభాకర్, బాల్దె విజయ సిద్దిలింగం, బక్క నాగరాజు, మేకల కలింగ రాజు పాల్గొన్నారు.