హామీలిచ్చుడు.. దాటేసుడు కేసీఆర్​కు అలవాటే..

హామీలిచ్చుడు.. దాటేసుడు కేసీఆర్​కు అలవాటే..

అశ్వారావుపేట, వెలుగు :  పూటకో మాట చెబుతూ ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన అబద్దపు టీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ​కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రంలో భాగంగా ఆయన ఆదివారం అశ్వారావుపేట మండలంలో పర్యటించారు. ముందుగా మండల పరిధిలోని వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మకు పూజలు చేశారు. వినాయకపురం సెంటర్​లో బీఎస్పీ జెండా ఆవిష్కరించారు. గుమ్మడవల్లి, నారాయణపురం, నందిపాడు, ఖమ్మంపాడులలో మాట్లాడుతూ ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం గెలిచాక ఆ హామీలను దాటవేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఏ ఏజెన్సీ గ్రామానికి వెళ్లినా ప్రధానంగా పోడు భూముల సమస్య గురించే చెబుతున్నారని, వాటిని పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నేటికీ గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక పేదలు అవస్థలు పడుతున్నారని, బీఎస్పీ అధికారంలోకి వస్తే తెలంగాణను పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా మారుస్తామన్నారు. ఇండ్లు లేని వారికి పక్కా ఇండ్లు కట్టిస్తామన్నారు. బీఎస్పీ లీడర్లు కృష్ణారావు, మడకం ప్రసాద్, వేల్పుల నాగమేశ్వరరావు, మంగరాజు, రామకృష్ణ, వీరబాబు పాల్గొన్నారు.