విశ్లేషణ: కేసీఆర్​ పట్టు కోల్పోతున్నరా

‘‘మాపై అనవసరంగా కామెంట్లు చేస్తే మీ నాలుకలు కోస్తం!’’ ఇటీవల బీజేపీపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలు ఇవీ. హుజూరాబాద్​ ఉప ఎన్నికలో ఘోర పరాజయం తర్వాత టీఆర్ఎస్ చీఫ్ వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోంది. బీజేపీ మీద తీవ్రంగా మండిపడుతున్నారు. కేసీఆర్​ మాటలు, వైఖరిని చూస్తుంటే ఆయనలోని అభద్రతాభావం బయటపడుతోంది. అయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అత్యున్నత పదవిలో ఉన్న కేసీఆర్​ నోటి నుంచి ఇలాంటి అసభ్యకరమైన, దిగజారిన మాటలు వచ్చి ఉండాల్సింది కాదు. తెలంగాణలో తన రాజకీయ పట్టు తప్పిపోతోందన్న నిస్సహాయత ఆయన మాటల ద్వారా వెల్లడవుతోంది. 

గతంలో సీఎం కేసీఆర్ బీజేపీ సెంట్రల్​ లీడర్​షిప్​పై ఒకరకంగా, ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై మరోరకంగా వ్యవహరించే వారు. ఏ విషయంలోనైనా బీజేపీ కేంద్ర నాయకత్వంపై నోరు మెదపకుండా, రాష్ట్ర నాయకత్వాన్ని మాత్రమే టార్గెట్​ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తనపై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతున్నందు వల్ల రాష్ట్రంలో తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో తన పట్టును నిలుపుకోవాలనే ఉద్దేశంతో మెల్లగా కేసీఆర్​ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం మొదలుపెట్టారు. దీని ద్వారా తెలంగాణలో తన పట్టును నిలుపుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.

 
ఏడాదిగా రైతులు గుర్తురాలేదు
హుజూరాబాద్​ అసెంబ్లీ బై ఎలక్షన్ లో ఎదురైన పరాభవంతో కేసీఆర్​ రైతు సమస్యలను భుజానకెత్తుకుని వారి పక్షాన పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొన్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేసీఆర్​ ఇప్పుడు డిమాండ్​ చేస్తున్నారు. ఈ చట్టాలపై ఇంత వరకూ ఎప్పుడూ నోరు మెదపని కేసీఆర్ ఇప్పుడు వాటిని రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్​ చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఏడాది కాలంగా రైతులు ఈ చట్టాలపై ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. అయితే ఇంత కాలం వాటిపై కేసీఆర్​ ఒక్క మాట మాట్లాడింది లేదు. కానీ, హుజూరాబాద్​ బై ఎలక్షన్​లో ఎదురైన ఓటమి తర్వాతే ఆయన వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆయన చేస్తున్న డిమాండ్​లో విశ్వసనీయత మచ్చుకైనా కనిపించడం లేదు.


బీజేపీతో దోస్తీకి ఎన్నో ప్రయత్నాలు
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావడానికి చాలా ముందు అంటే 2009 నుంచి కేసీఆర్​ బీజేపీతో దోస్తీ కోరుకున్నారు. 2009 జనరల్​ ఎలక్షన్ల తర్వాత, ఫలితాల కోసం ఎదురుచూడకుండానే, కేసీఆర్ బీజేపీకి బేషరతు మద్దతును ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవ్వడంతో ఆయనకు భంగపాటు ఎదురైంది. 2014లో కాంగ్రెస్​ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేసీఆర్​ ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో కేంద్రంలో నరేంద్రమోడీ అధికారాన్ని చేపట్టారు. అప్పటి నుంచి బీజేపీకి దగ్గరయ్యేందుకు కేసీఆర్​ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అన్ని కీలక విధానపరమైన అంశాల్లో బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తూ వచ్చారు. ప్రతిపక్ష హోదా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూనే.. బీజేపీకి మద్దతివ్వడానికి ఎటువంటి అవకాశం వచ్చినా కేసీఆర్​ వదిలిపెట్టలేదు. బీజేపీ పట్ల తన విధేయతను నిరూపించుకోవడానికి ప్రతిపక్షాలు ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరు కాకుండా తగిన జాగ్రత్త తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, త్రిపుల్​ తలాక్​ బిల్లు, సిటిజన్​షిప్​ సవరణ చట్టం ఇలా కీలకమైన చాలా అంశాల్లో కేసీఆర్​ బీజేపీకి సపోర్ట్​ చేశారు. సభలో పరిస్థితుల ఆధారంగా కేసీఆర్​ నిర్ణయం తీసుకునేవారు. దానికి అనుగుణంగా బీజేపీతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేసేశారు. కొన్ని సార్లు బీజేపీకి సహాయం చేసేందుకు ఓటింగ్​కు దూరంగా ఉండాలని తన ఎంపీలకు కేసీఆర్ సూచించేవారు. అలాగే ఎన్డీయేలో చేరేందుకు కూడా కేసీఆర్​ చాలా ప్రయత్నాలే చేశారు. కానీ ఎందుకో అది వర్కవుట్​ కాలేదు.


సమస్యలన్నీ పెండింగ్‌‌లోనే..
తెలంగాణకు తానే చిరునామా అని చెప్పుకునే కేసీఆర్‌‌‌‌ విభజన చట్టంలోని షెడ్యూల్‌‌ IX, X కింద ఎక్కువగా హైదరాబాద్‌‌లో ఉన్న ఉమ్మడి సంస్థల ఆస్తులు, బకాయిల పంపిణీ వంటి వాటిని కూడా అమలు చేయలేకపోయారు. అవి ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఇక బయ్యారంలో స్టీల్‌‌ ఫ్యాక్టరీ, ఖాజీపేటలో రైల్వే కోచ్‌‌ ఫ్యాక్టరీ, ట్రైబల్‌‌ యూనివర్సిటీ, మైనింగ్‌‌ యూనివర్సిటీ, కాళేశ్వరం లేదా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌లలో ఏదో ఒక దానికి జాతీయ హోదా ఇలా విభజన చట్టంలోని చాలా అంశాలు ఇంకా పెండింగ్‌‌లో ఉన్నాయి. సంవత్సరాల తరబడి తెలంగాణకు సంబంధించిన ఈ విషయాలపై కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారు. రాష్ట్రాన్ని పోలీస్‌‌ స్టేట్‌‌గా మార్చేందుకు పోలీసులకు ఎక్కువ అధికారాలను కట్టబెట్టారు. దాంతో ముఖ్యమైన పరిపాలనా వ్యవస్థలు పోలీస్‌‌ నియంత్రణలోకి వెళ్లాయి.


యువత త్యాగాన్ని మరచిన్రు‌‌
‘తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలొదిలిన వేలాది మంది యువకుల త్యాగాన్ని కేసీఆర్‌‌‌‌ మరిచారు’ అంటూ 2018‌‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సుష్మా స్వరాజ్‌‌  దుయ్యబట్టారు. ‘‘ప్రత్యేక తెలంగాణ కోసం 1,500 నుంచి 2,500 మంది యువకులు మరణిస్తే, కేవలం 400 మంది అమరులకు మాత్రమే టీఆర్ఎస్‌‌ ప్రభుత్వం ఎక్స్‌‌గ్రేషియా ఇచ్చింది. అమరులను గుర్తించని కేసీఆర్​పై నాకు చాలా కోపంగా ఉంది. కేసీఆర్‌‌‌‌ తన కుటుంబాన్ని మాత్రమే అందలం ఎక్కిస్తారు. తన కొడుకు, అల్లుడిని మంత్రులను చేయడం, కూతురు, తోడల్లుని బిడ్డను పార్లమెంట్‌‌కి పంపడం దీనికి ఉదాహరణ. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు దీనిని అంగీకరించరు”అని ఆ నాడే ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆమె మాటలు అక్షర సత్యాలు అవుతున్నాయని అర్థమవుతోంది.


వరి సాగుపై వింత వైఖరి
ఇటీవల వరి సాగుకు సంబంధించి కేసీఆర్‌‌‌‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను అన్నపూర్ణగా మారుస్తానని స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఉపన్యాసం ఇచ్చి కొన్ని వారాలైనా గడవక ముందే కేసీఆర్​ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో వరి సేకరణలో తగ్గింపులు ఉంటాయని లీకులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి. నిరసనల నేపథ్యంలో వరి సాగు అనేది ఆత్మహత్యా సదృశ్యమని కేసీఆర్‌‌‌‌ వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరించేది లేదని కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వం తెగేసి చెప్పిన కారణంగా ఐదుగురు రైతులు ఇప్పటి వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సడన్‌‌గా యూటర్న్‌‌ తీసుకుని కేంద్రమే తెలంగాణ నుంచి ధాన్యం సేకరించాలనే డిమాండ్‌‌ చేయడం ఆయన రాజకీయ దిగజారుడుతనాన్ని తెలియజేస్తోంది. వరి సాగు వద్దని రైతులను హెచ్చరించిన కేసీఆర్‌‌‌‌ ఈ కామెంట్లు చేయడం హాస్యాస్పదంగా ఉంది. మరో వరి సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన మరో యూటర్న్‌‌ తీసుకున్నారు.


ఇది కేసీఆర్​కు పరీక్షా కాలం
అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు వచ్చాయి. కానీ గత ఏడేండ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.2.52 కోట్లు ఇచ్చింది. పైగా జాతీయ రహదారుల నిమిత్తం రూ.40,000 కోట్లు, కొత్త రైల్వే ప్రాజెక్ట్‌‌ల కోసం రూ.21,000 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి అవలంబించాల్సిన రాజకీయ వైఖరిపై కేసీఆర్​కే స్పష్టత లేదు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం, స్వప్రయోజనాల కోసం కేసీఆర్‌‌‌‌ తన వైఖరిని తరచూ మార్చుకుంటూ ఉంటారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత వైఖరిని భవిష్యత్‌‌లో కొనసాగించడం కేసీఆర్‌‌‌‌కు ఇకమీదట కష్టమే. 2023 అసెంబ్లీ ఎన్నికలు శరవేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రసత్తుం కేసీఆర్‌‌‌‌కు పరీక్షా కాలం ఎదురవుతోంది.

తెలంగాణ ప్రయోజనాలు పట్టించుకోలే
మరోవైపు బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నాలను కేసీఆర్‌‌ చేయకపోవడంతో ప్రజల్లో నైరాశ్యం పెరుగుతోంది. తెలంగాణ రాక ముందు నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కేసీఆర్​ పోరాడారు. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి కేటాయించిన వాటాను కాపాడుకునేందుకు ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం ఆయన ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తెలంగాణలోని యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కూడా కేసీఆర్​ ఎటువంటి ఆసక్తి చూపించలేదు. ఇక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన మాటను కేసీఆర్ నిలుపుకోలేదు. అలాగే దళితులకు భూమి ఇస్తానని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని ఇచ్చిన వాగ్దానాలను పట్టించుకోలేదు. ఇక రైతులు ఆందోళన పథంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ స్పందించలేదు.

ఆత్మరక్షణలో కేసీఆర్
తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను చూసి కేసీఆర్‌‌‌‌ లో ఆందోళన మొదలైంది. కేసీఆర్‌‌‌‌ సొంత జిల్లా మెదక్‌‌లోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నుంచి బీజేపీ విజయ ప్రస్థానం మొదలైంది. ఆ వెంటనే జరిగిన జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టింది. దీంతో 2014లో తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి హైదరాబాద్‌‌లో తొలిసారిగా కేసీఆర్‌‌‌‌ ఆధిపత్యానికి గండి పడినట్లయ్యింది. ఇక హుజూరాబాద్‌‌ ఉప ఎన్నిక కేసీఆర్​ రాజకీయ భవిష్యత్‌‌ను మారుస్తున్నట్లే కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా ఉన్న కేసీఆర్​ ఇప్పుడు బలహీనపడి ఆత్మరక్షణలో పడ్డారు. ఇది ఆయనను మరింతగా బలహీన పరుస్తోంది. తనను తాను రాజకీయ వ్యూహకర్తగా భావించే కేసీఆర్‌‌‌‌ తెలంగాణలో తన మునుపటి ప్రాభవాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. 2023లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది కేసీఆర్‌‌‌‌ రాజకీయ పతనానికి పునాది వేసే అవకాశం కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌‌ సాధించాలన్న కేసీఆర్‌‌‌‌ కల కల్లగా మారే పరిస్థితులు ఎదురవుతున్నాయి. 
                                                                                                           - పర్సా వెంకట్, పొలిటికల్​ ఎనలిస్ట్