
- సర్వే అధికారులకు వివరాలు అందిస్తారా?
- తొలిదఫాలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్, డీకే అరుణ
- మిగతా చోట్ల పలువురు లీడర్ల కూడా వివరాలివ్వలే
- ఈ నెల 28 వరకు మరో మారు ప్రత్యేకంగా సర్వే
హైదరాబాద్: కులగణనలో పాల్గొనని 3,56,323 కుటుంబాలు, 16 లక్షల మంది కోసం ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఆ నంబర్ కు కాల్ చేస్తే ఎన్యూమరేటర్లు వచ్చి వివరాలు స్వీకరిస్తారని తెలిపింది. దీంతోపాటు న్లైన్ లో నమోదు చేసుకునేందుకు వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేసింది. కులగణన సర్వేలో ప్రతిపక్ష నేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో పాటు పలువురు పాల్గొనలేదు. వీళ్లు ఈ సారైనా తమ వివరాలు ఇస్తారా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది. వీళ్లందరిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్, డీకే అరుణపైనే అందరి దృష్టీ నెలకొంది. కులగణనపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే సమయంలో ఎన్యూమరేటర్లకు వివరాలు ఇవ్వొద్దని అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారని, తాము అదే అవలంబించామని సమర్థించుకున్నారు.
ALSO READ | ఆ జిల్లాల్లో వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వండి: సీఎం రేవంత్ ఆదేశం
దీనికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వేలో పాల్గొనని సభ్యులకు అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడే అర్హత లేదన్నారు. దీనిపై వాడి వేడి చర్చ జరిగిన తర్వాత సాక్షాత్తూ ముఖ్యమంత్రే సర్వేలో పాల్గొనని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వివరాలను ప్రకటించారు. భూముల వివరాలు అడిగినందుకే భయపడి.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సర్వేలో పాల్గొనలేదని ఎద్దేవా చేశారు. ఈ కులగణన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 3.54 కోట్ల మంది పాల్గొన్నారని, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు భూముల వివరాలు ఇచ్చారని.. కానీ కొందరు మాత్రమే ఇవ్వలేదని తెలిపారు. దీనిపై బీసీ సంఘాల నుంచి కూడ అభ్యంతరాలు తలెత్తడంతో మరో అవకాశం ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు నిన్నటి నుంచి సర్వేను ప్రారంభించింది. ఇప్పుడైనా ఈ నేతలు పాల్గొంటారా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.