కష్టాల కడలిలో కేసీఆర్!

కష్టాల కడలిలో కేసీఆర్!

తెలంగాణ మాజీ  సీఎం కేసీఆర్  ప్రస్తుతం కష్టాల కడలిలో  కొట్టుమిట్టాడుతున్నారు.  అనారోగ్యం ఒకవైపు, మరోవైపు  కూతురు ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడం, పార్టీ ఎమ్మెల్యే లు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్​ను వీడటం ఆయనను కలవరపెడుతోంది.  కాంగ్రెస్ పార్టీలోకి కొందరు,  బీజేపీలో మరికొందరు చేరుతుండటంతో బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్​ సతమతం అయిపోతున్నారు. అధికారం దూరమైతే ఈ పరిణామాలు ఉంటాయి అనేది ఆయనకు తెలుసు.  

పోయేటోళ్ళు పోనీ, ఉండేటోళ్ళు ఉండని అనేవిధంగా కేసీఆర్ ఉన్నారా?.  ఆయన రాజకీయాలను ఎరిగినవారు ఇప్పుడు ఆయన ప్రస్తుతం పార్టీ గురించి ఆలోచిస్తున్నారని అంటారు. నిజానికి పవర్ పాలిటిక్స్ ఇలాగే ఉంటాయి. పవర్ ఎటుంటే అటు విపక్షాల ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లిపోతుంటారు. తెలంగాణ ఉద్యమం తర్వాత తనకు సీఎం పదవి ఇస్తే టిఆర్ఎస్​ను కాంగ్రెస్​లో  విలీనం చేసేస్తానని స్వయంగా కేసీఆర్ అన్నారు.  మొత్తం కుటుంబంతో  కలిసి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ దగ్గరకు వెళ్లి తెలంగాణ ఇచ్చినందుకు ధన్యవాదములు తెలుపుతూ పై విషయం కూడా చెప్పారు. కానీ, తెలంగాణ రాష్ర్టం ఆవిర్భావం అనంతరం ఆయన ఫక్తు రాజకీయాలకు తెరదీశారు. 

కేసీఆర్​ సర్కారుకు చరమగీతం

2014లో టీడీపీ, కాంగ్రెస్ నాయకులను పార్టీలోకి చేర్చుకుని అధికారం సాధించారు. 2018లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. రాష్ట్రంలో వరుసగా రెండోసారి 2018లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎక్కువమందిని  చేర్చుకుని, కాంగ్రెస్​పార్టీకి విపక్ష హోదా లేకుండా చేశారు. తన పార్టీ తప్ప వేరే పార్టీ ఉండొద్దు, ప్రశ్నించే విపక్షం ఉండొద్దు అనేవిధంగా కేసీఆర్​ వ్యవహరించారు. మొత్తం ఆధిపత్యమే, అసెంబ్లీలోను అదే ధోరణి ఉండేది.  ప్రజలను కలిసేది లేదు. అర్జీలు తీసుకునేది లేదు.  సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయనను కలవడానికి పడిగాపులు కాసే పరిస్థితి ఉండేది.  మొత్తం తెలంగాణకే ఆయన పాలన ఆత్మగౌరవ సమస్యగా, పెను సవాల్ అయిపోయింది. నెత్తికెక్కించుకున్నవారే 2023 ఎన్నికల్లో నేలకేసి కొట్టారు. కేసీఆర్​ సర్కారుకు చరమగీతం పాడి కూల్చేశారు. కాంగ్రెస్ పార్టీకి పాలక పగ్గాలు ఇచ్చారు.

బీఆర్ఎస్ ఖాళీ!

జైసీ కర్నీ  వైసీ భర్నీ అంటారు. మాజీ  సీఎం కేసీఆర్ ఇతర పార్టీ వాళ్లను తాను అధికారంలో ఉన్నపుడు  ఏవిధంగా తన పార్టీలో కలిపేసుకున్నారో.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదే బాట పట్టారు.  వంద రోజుల కాంగ్రెస్ పాలన పూర్తి అవగానే ప్రజాస్పందన చూసి కాంగ్రెస్ పార్టీలో  చేరుడు మొదలుపెట్టారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు బీఆర్ఎస్​ను వదిలి కాంగ్రెస్ పార్టీలో  చేరిపోయారు. 

ఇక మాజీ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్​కు లైన్ కట్టారు . కేసీఆర్ ఏ పని అయితే చేశారో అదే పని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి  చేస్తున్నారు. బీఆర్ఎస్  పార్టీకి  ఉన్న 39 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది దాకా ఇప్పటికే కాంగ్రెస్​లో చేరడానికి సిద్ధం అయినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల  ప్రకటన రాగానే  చేరికల పర్వం మొదలయ్యింది.  సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో  టీపీసీసీ అధ్యక్షుడుగా యాక్టివ్ అవుతున్నారు.  నేరుగా వయా మీడియా లేకుండా సీఎంను బీఆర్ఎస్  నేతలు డైరెక్ట్ గా  కలుస్తున్నారు. ---మొత్తానికి బీఆర్ఎస్ తెలంగాణలో ఖాళీ అయిపోతుందా?  అనే అనుమానం  కలుగుతున్నది.  ప్రస్తుతం కేసీఆర్ పార్టీని పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారా?.  ఆయనకు బిడ్డ అరెస్ట్ పరేషాని ఇప్పుడు అన్నింటికన్నా ఎక్కువగా ఉంది.  

ఈ మేరకు క్యాడర్ టాక్ గ్రౌండ్ లో స్పష్టంగా వినిపిస్తున్నది.  ఆ దర్పం, హడావిడి ఏది?.  నిజానికి తెలంగాణ ఉద్యమం సమయంలో,  ప్రభుత్వంలో  సీఎంగా ఉన్నప్పుడు  కేసీఆర్ హడావిడి, ఆ హంగామా చాలా డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు అదేమీ కనిపించడం లేదు. అధికారం కోల్పోయిన తరువాత కొద్దిరోజులకే ఆయన సిక్ కావడంతో పాటు ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు.  ఎంతో ఆర్భాటంగా కట్టి ప్రారంభించిన జిల్లా బీఆర్ఎస్  కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.  మొత్తానికి కేసీఆర్, ఆయన పార్టీ,  పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి  స్పీడుకు, అటు బీజేపీ దూకుడుకు అసలు రాష్ట్రంలో ఉంటుందా?.  పార్టీ పున:నిర్మాణం మీద గులాబీ బాస్ దృష్టి పెడతారా? లేదా వేచి చూడాల్సిందే.

- ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్, ఎనలిస్ట్​.