ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడ్తే.. నేనెక్కడికి రావాలె.?:కేసీఆర్

ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడ్తే..  నేనెక్కడికి రావాలె.?:కేసీఆర్
  • కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్ల?: కేసీఆర్
  • కేసీఆర్ అన్నా.. రావేరావే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు 
  • రాష్ట్రంలో మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలైనయ్​ 
  • తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్సే
  • రాష్ట్ర సంపదపై కొన్ని గుంటనక్కలు కన్నేసినయ్​
  • మంచి పాలన కావాలంటే మళ్లీ చంద్రబాబు రావాల్నట 
  • ఇలాంటి కుట్రలను పసిగట్టి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వ్యాఖ్య 

హైదరాబాద్, వెలుగు: పల్లెల నుంచి హైదరాబాద్‌కు బతికేందుకు వచ్చిన పేదలకు బీఆర్ఎస్​హయాంలో అండగా నిలిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ల ఇండ్లను కూలుస్తున్నదని మాజీ సీఎం, బీఆర్ఎస్​అధినేత కేసీఆర్​అన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చేస్తుంటే.. కేసీఆర్ అన్నా.. ఎక్కడున్నావ్​? రావే.. రావే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు కదా.. నేను ఎక్కడకు రావాలె? కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా అయితది? కేసీఆర్​పాలనలో పదేండ్లు ప్రశాంతంగా బతికామని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలయ్యాయి. మన రాష్ట్రంలో ఎప్పుడూ ఇదే లొల్లా? ప్రశాంతంగా బతకొద్దా? ప్రజలు ఇప్పటికైనా తెలివిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాదయాత్రలు కాదు.. మనసుపెట్టి యాత్రలు చేయాలి. బుర్రతో ఆలోచనలు చేయాలి. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను పాడు చేసుకునే ఆలోచనలు కాకుండా మన భవిష్యత్​తరాలను మరింతగా బాగు చేసుకునే దిశగా ఆలోచించాలి’’ అని పేర్కొన్నారు. 

రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ నేతృత్వంలో 200 మంది బీఆర్ఎస్​నేతలు, కార్యకర్తలు.. రామగుండం నుంచి ఎర్రవల్లిదాకా 180 కిలోమీటర్ల మేర వారం రోజుల పాటు చేసిన పాదయాత్ర శనివారం ముగిసింది. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో నిర్వహించిన పాదయాత్ర ముగింపు సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్​పాలనలో గోదావరి, కాళేశ్వరం ప్రాజెక్టులు జలాలతో అలుగుపోశాయని.. కానీ నేడు కాంగ్రెస్​తెచ్చిన కరువుతో చెరువులు, కుంటలు అడుగంటి ఎడారిగా మారాయని అన్నారు. నిరుడు ఇదే రోజు నిండుకుండల్లా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులు ఇప్పుడు ఎందుకు ఎండిపోయాయో ప్రజలకు తెలుసన్నారు. ‘‘రాష్ట్రానికి ప్రధాన శత్రువు కాంగ్రెస్సే. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్​పార్టీ ఎన్నో మోసాలు చేసింది. నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్​నేతలు రాష్ట్రానికి ద్రోహం చేస్తూనే ఉన్నారు. కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. ఎంతో జాగ్రత్తగా నిలబెట్టుకున్నాం. ప్రజలు ఏమనుకున్నారో ఏమోగానీ కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అది వాళ్ల ఇష్టం. దాని ఫలితాన్ని లోకం చూస్తున్నది’’ అని అన్నారు.  

నీళ్లు, కరెంట్​ఎటు పోయినయ్​?

వ్యవసాయానికి నాణ్యమైన ఫ్రీ కరెంట్, పంట పెట్టుబడి సాయం, సాగునీరు, గిట్టుబాటు ధర వంటి వాటిని బీఆర్ఎస్​హయాంలో ప్రాధాన్యంగా తీసుకుని అమలు చేశామని కేసీఆర్​పేర్కొన్నారు. అందుకే పదేండ్ల పాటు రైతులు ఎలాంటి బాధలు లేకుండా బతికారని.. కానీ, ప్రస్తుత ప్రభుత్వం వీటిని అందించడం కోసం ఖర్చుకు వెనకాడుతున్నదని మండిపడ్డారు. ఈ పరిస్థితులను తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నారు. ‘‘మనం ఇచ్చిన కరెంటు ఎటు పోయింది? మనం ఇచ్చిన మిషన్ భగీరథ తాగునీరు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎండాకాలంలోనూ మత్తడి దూకిన చెరువులు ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయి? ఇన్నాళ్లూ లేని నీటి గోస ఇప్పుడెందుకు వచ్చింది? తెలంగాణకు నీళ్లివ్వాలన్న ప్రాధాన్యాన్ని రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పుడు రాష్ట్రానికి సాగు, తాగునీటి సమస్య వచ్చింది. పాలకులు మొదటి నుంచీ నీటి సమస్యను ఆర్థిక సమస్యగానే చూశారు. గల్ఫ్​లాంటి ఎడారి దేశాల్లో నీళ్లుండవు. అక్కడి ప్రభుత్వాలు సముద్ర జలాల నుంచి ఉప్పును వేరుచేసి నీటిని శుద్ధి చేసి మంచినీరుగా మార్చి వాడుకుంటాయి. మద్రాస్‌లో కూడా నీటి కొరతను అధిగమించేందుకు అటువంటి కార్యాచరణను చేపట్టారు. భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల శ్రేయస్సును పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాలు పనిచేయాలి. అంతేతప్ప వాటిని ఖర్చుకు లింకు పెట్టడం తప్పు’’ అని అన్నారు. 

తెలంగాణను ఆగం జేసేందుకు కుట్ర.. 

తెలంగాణ సంపద మీద చాలా మంది గుంట నక్కల్లాగా కన్నేసి ఉంచారని కేసీఆర్​ అన్నారు. ‘‘ఇప్పుడున్న పాలకులు మంచిగా పాలించడం లేదంటున్నారు. మంచిగా పాలించాలంటే మళ్లీ చంద్రబాబు రావాలంటున్నారు. రాష్ట్రంలో వచ్చేసారి ఎన్డీయే కూటమి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నాయి. తెలంగాణను ఆగం చేసేందుకు కొందరు రెడీగా ఉన్నారు. వాళ్ల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణను ఆగం చేసే కుట్రలను పసిగట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి” అని పేర్కొన్నారు.