- మెకానిక్ పనిచేస్తూనే ఇంటర్‌లో 98 శాతం మార్కులు
ఉదయాన్నే డుగ్గు, డుగ్గుమంటూ బుల్లెట్ బండి సౌండ్ వింటూ నిద్రలేచేది. అలా తెలియకుండానే తనకి ఆ బండి మీద ఇష్టం పెరిగిపోయింది. కొంచెం పెద్దయ్యాక బుల్లెట్ బండి రిపేర్ నేర్చుకుంది. కేరళలో యంగ్ బైక్ మెకానిక్ తనే. ఇప్పుడు తనకి ఇష్టమైన బుల్లెట్ బండి మీద రయ్‌మంటూ దూసుకెళ్తోంది. ఆమె దివ్య జోసెఫ్. ఈయంగ్స్టర్ బుల్లెట్ జర్నీ ఇది...
కొట్టాయం రైల్వేస్టేషన్ దగ్గర్లో దివ్య నాన్న జోసెఫ్ డోమ్నిక్ నడిపే బైక్ మెకానిక్ షాప్ అక్కడ చాలా ఫేమస్. మొదట్లో ఇంటి వెనకాలే బుల్లెట్ బండ్లు రిపేరింగ్ చేసేవాడు జోసెఫ్. రానురాను బుల్లెట్ బండ్లు నడిపేవాళ్లు ఎక్కువయ్యారు. రిపేర్‌కి వచ్చే బండ్లు కూడా ఎక్కువవడంతో షాప్‌ని ఇంటి ముందుకి మార్చాడు. అప్పుడు దివ్య టెన్త్ క్లాస్ చదువుతోంది. సమ్మర్ హాలిడేస్‌లో ఫోన్, టీవి చూస్తూ గడపడం ఇష్టంలేక సరదాగా బైక్ రిపేర్ నేర్చుకోవాలనుకుంది. కూతురి ఇష్టాన్ని కాదనలేక వాళ్ల నాన్న కూడా ‘ఓకే’ అన్నాడు.
రోజుకి మూడు బైకులు
తండ్రి బుల్లెట్ బండ్లు రిపేర్ చేస్తుంటే జాగ్రత్తగా గమనించేది దివ్య. మొదట్లో కస్టమర్లు నుంచి వచ్చే కంప్లైట్లు రాసేది. తర్వాత మెల్లగా ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఆయిల్, కేబుల్ మార్చడంతో పాటు సర్వీసింగ్ చేయడం కూడా నేర్చుకుంది. ఇప్పుడు ఈజీగా రోజుకు మూడు బుల్లెట్ బండ్లు సర్వీసింగ్ చేస్తుంది. అంతేకాదు డ్రైవింగ్ కూడా నేర్చుకుంది దివ్య. ఈలోగా సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. కాలేజీలో చేరింది. కానీ, కాలేజీ నుంచి ఇంటికి రాగానే షెడ్డులోకి వెళ్లేది. కూతురి చదువు ఎక్కడ దెబ్బతింటుందోనని వాళ్ల అమ్మ టెన్షన్ పడేది. కానీ ప్లస్–టూలో దివ్య 98 శాతం మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతోంది.
అమ్మమ్మ ఇంటికి డ్రైవ్ చేస్తూ...
ఈమధ్యే దివ్యకి బర్త్ డే గిఫ్ట్‌గా బుల్లెట్ బండి కొనిచ్చాడు వాళ్ల నాన్న. ఇంకేముంది డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుని తన సిస్టర్ మరియాని కొత్త బుల్లెట్ బండిపై ఎక్కించుకుని తిరుగుతోంది.
వాళ్ల అమ్మమ్మ ఊరైన ‘ముందా కాయం’కు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడానికి రెడీ అయింది ఇప్పుడు.