రూ.188.31 కోట్లతో ఖమ్మం నగర బడ్జెట్ ఆమోదం : ముజామ్మిల్ ఖాన్

రూ.188.31 కోట్లతో ఖమ్మం నగర బడ్జెట్ ఆమోదం : ముజామ్మిల్ ఖాన్
  • 60 డివిజన్లను ఐదు జోన్లుగా విభజించి పాలనకు రూపకల్పన
  • ప్లాస్టిక్ రహిత ఖమ్మం నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి
  • ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : 2025-–26 ఆర్థిక సంవత్సరానికి రూ.188.31 కోట్లలో ఖమ్మం నగర బడ్జెట్ ఆమోదం పొందినట్లు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కేఎంసీ కమిషనర్​ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీజ తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పన్ను ద్వారా రూ. 33 కోట్ల 92 లక్షలు, సర్ చార్జ్ స్టాంప్ డ్యూటీ ద్వారా రూ. 13 కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా రూ.55 కోట్ల 90 లక్షల ఆదాయం సమకూరుతుందని బడ్జెట్ లో అంచనా వేసినట్లు తెలిపారు. 

కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను, ఇతర పన్నులు రీ- అసెస్మెంట్ చేసి ఆదాయ మార్గాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. వరదలు వచ్చినప్పుడు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పని చేయడాన్ని ప్రశంసించారు. అర్బన్ కు ప్రత్యేకంగా ఇద్దరు తహసీల్దార్, ముగ్గురు సర్వేయర్ల నియమాకానికి రెండు రోజుల్లో ప్రభుత్వం ఆమోదం లభిస్తుందని తెలిపారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు పక్కా ప్లాన్​తో పనిచేయాలని సూచించారు. 

ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో తీగల వంతెన నిర్మాణానికి సంబంధించి పనులు వేగవంతం చేయడానికి, శ్మశాన వాటిక అభివృద్ధికి ఎంపీ, ఎమ్మెల్సీల నిధుల్లో భాగంగా రూ.4 కోట్లు కేటాయించాలని మంత్రి ప్రతిపాదనను అందరం ఆమోదించామని తెలిపారు. నగర మేయర్‌ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విలీన పంచాయతీల అభివృద్ధిపైనే దృష్టిసారించాలని  కోరారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వచ్చే నెల మొదటి వారంలో మరోసారి కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ కార్పొరేషన్ 43వ వార్డులో పన్నుల రీ- అసెస్మెంట్ చేయడం ద్వారా 60 లక్షల వరకు ఆదాయం పెరిగిందన్నారు. 

నగరంలో వ్యాపారాలు నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ చేసుకునేలా సర్వే చేపడతామని చెప్పారు. ప్రతి జోన్ లో రెవెన్యూ అధికారి, పారిశుధ్య ఇన్​స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఏఈ టౌన్ ప్లానింగ్ ఉండేలా చూస్తామన్నారు. అంతకుముందు ప్రోటోకాల్ పాటించడంలేదని, గత 8 నెలలుగా ఒక్క కౌన్సిల్​ మీటింగ్ లో కూడా జరగలేదని ప్రజా సమస్యలపై ముందు  మాట్లాడాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినదించారు. ప్రజా సమస్యలపై ఎప్పుడు మీటింగ్​ ఏర్పాటు చేస్తారో డేట్ చెప్పిన తర్వాతే బడ్జెట్ సమావేశం నిర్వహించాలని పట్టుబట్టారు. కలెక్టర్ జోక్యం చేసుకొని సమావేశం సజావుగా సాగేలా చూశారు.