- ఉధృతంగా మున్నేరు ప్రవాహం
- నీట మునిగిన ఇండ్లు, కొట్టుకుపోయిన కార్లు, బైకులు
- పరిశీలించిన కలెక్టర్, ప్రజాప్రతినిధులు
- బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిచించిన ఆఫీసర్లు
ఖమ్మం/ ఖమ్మం టౌన్/ఖమ్మం రూరల్/ఫొటోగ్రాఫర్, వెలుగు: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు, ఆకేరు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో ఖమ్మం నగరంలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు నిండుగా పారుతున్నాయి. మున్నేరు బుధవారం అర్ధరాత్రి నుంచే ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఖమ్మం నగరంలోని లోతట్టు కాలనీల్లోని ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వైరాలో ఇందిరానగర్ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీల ముంపు బాధితులను రిలీఫ్ కేంద్రాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 866 కుటుంబాల్లోని 2005 మందిని ముంపు కాలనీల నుంచి 8 రిలీఫ్ కేంద్రాలకు తరలించారు.
వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి పువ్వాడ అజయ్, కలెక్టర్, సీపీ విష్ణు వారియర్పర్యటించి వారికి ధైర్యం చెప్పారు. రోడ్ల వెంట వరద నడుములోతు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు రెండు వందల ఇళ్లలోకి నీరు చేరింది. బాధితులను గురువారం తెల్లవారుజాము నుంచే పోలీసులు, పంచాయతీరాజ్ ఆఫీసర్లు జలగంనగర్‌లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆఫీసర్లు వారికి సౌలతులు కల్పించారు. వరద ఉధృతి అంతకంతకూ పెరగడంతో పునరావాస కేంద్రంలోకి సైతం నీరు చేరింది. అప్రమత్తమైన ఆఫీసర్లు ప్రజలను అక్కడి నుంచి మద్దులపల్లిలోని వైటీసీ భవన్లో ఏర్పాటు చేసిన కేంద్రానికి తరలించారు.
బాధితులను ఒప్పించిన కలెక్టర్...
మున్నేరు గురువారం తెల్లవారుజామున నుంచే ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆఫీసర్లు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ వీపీ గౌతమ్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. పెద్దతండాలోని కేజీబీఆర్ నగర్‌లోని ప్రజలు బయటకు రావడానికి సుముఖంగా లేకపోవడంతో కలెక్టర్ మైకు ద్వారా మాట్లాడారు.
ALSO READ :ఊర్లు చెరువులైనయ్.. టౌన్లు నదులైనయ్..
రంగాపురం బ్రిడ్జి వద్ద రాకపోకలు బంద్
పాల్వంచ రూరల్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పాల్వంచలోని కిన్నెరసాని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మండలంలోని రంగాపురం వద్ద బ్రిడ్జి కింద కోతకు గురయ్యే అవకాశం ఉండడం గమనించినవారు వాహనాల రూట్మళ్లించారు. కాగా గురువారం రాత్రి కేబీఆర్ నగర్ లో సతీశ్అనే యువకుడు గల్లంతయ్యాడు.
వణుకుతున్న ఏజెన్సీ
భద్రాద్రి కొత్తగూడెం/భద్రాచలం, వెలుగు: జిల్లాను వరదలు వణికిస్తున్నాయి. వరదల ఉగ్రరూపంతో ఏజెన్సీ గ్రామాలు గురువారం జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వర్షాలు తగ్గినా నాలుగైదు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పదుల సంఖ్యలో ఇండ్లు నేల మట్టమయ్యాయి. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్ట్‌ల గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. చుంచుపల్లి మండలంలోని విద్యానగర్‌కాలనీలో మోకాళ్ల లోతులో వరద నీరు ప్రవహించింది. ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కిన్నెరసాని ప్రాజెక్ట్10 గేట్లు ఎత్తడంతో బూర్గంపహాడ్ మండలంలోని అంబేద్కర్కాలనీవాసులను సేఫ్టీ కేంద్రాలకు తరలించారు. జిల్లాలోని పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పినపాక, చర్ల, అశ్వాపురం, గుండాల, ఆళ్లపల్లి, పాల్వంచ మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.
కలెక్టర్ప్రియాంక అల, ఎస్పీ వినీత్, పాల్వంచ డీఎస్పీ వెంకటేశ్ సందర్శించారు. పినపాక మండలం చింతల బయ్యారం, బోటు గూడెంలో నాలుగిండ్లు కూలాయి. అశ్వారావుపేట మండలం మరో ఇల్లు కూలింది. మణుగూరు మండలం పగిడేరులో మూడు పూరిండ్లు నేలమట్టమయ్యాయి. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, అశ్వాపురం, మణుగూరు, పినపాక, గుండాల, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో వరద ముంపునకు గురైన18 గ్రామాలు, 42 ఆవాసాలకు చెందిన దాదాపు 3296 మందిని సేఫ్టీ కేంద్రాలకు తరలించినట్టు కలెక్టర్చెప్పారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.