విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అందించాలి : ముజమ్మిల్ ఖాన్

విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అందించాలి : ముజమ్మిల్ ఖాన్
  • ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : 8వ తరగతి నుంచి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి లైబ్రరీ, రీడింగ్ రూమ్స్, మా పాప- మా ఇంటి మణిదీపం, సన్న బియ్యం తదితర కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే పిల్లలకు కెరీయర్ గైడెన్స్ అందించేందుకు మూడు నెలలకోసారి మండల కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 

గ్రామాల్లో రీడింగ్ రూమ్స్ ఏర్పాటుచేయాలని చెప్పారు. పంచాయతీశాఖ పరిధిలో పారిశుధ్య కార్మికులకు, జిల్లాలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ స్టాఫ్ కు బీమా సౌకర్యం కల్పించాలని చెప్పారు. మా పాప-- మా ఇంటి మణిదీపం కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఆడ పిల్లలకు పోస్టాఫీస్​ సుకన్య సమృద్ధి యోజన కింద ఖాతా ఓపెన్ చేయించాలని సూచించారు. 

రోటరీనగర్ మార్కెట్ ను ఫిష్ మార్కెట్ గా..

రోటరీ నగర్ మార్కెట్ ను ఫిష్ మార్కెట్ గా తీర్చిదిదేందుకు సాధ్యాసాధ్యాలు, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రోటరీ నగర్ మార్కెట్ ను, శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. రోటరీ నగర్ మార్కెట్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నందున, దీనిని ఫిష్ మార్కెట్ కింద వినియోగించుకునేందుకు పరిశీలించాలని చెప్పారు. శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో జరుగుతున్న ఆధునీకరణ, అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.  

పట్టుదలతో చదవాలి.. లక్ష్యాన్ని చేరుకోవాలి

వైరా : విద్యార్థులు పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. వైరాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల ఆవరణ, గ్రౌండ్, లైబ్రరీ‌‌, టాయిలెట్స్, తాగునీరు, కిచెన్ షెడ్ లను పరిశీలించారు. ఆవరణలో చెత్త, శిథిలాల వ్యర్థాలు ఏమిటని హెచ్​ఎంను ప్రశ్నించారు. 

విశాలమైన గ్రౌండ్ ఉన్నందున ఫుట్ బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేసి క్రీడలను పిల్లలకు అందుబాటులో తేవాలని అధికారులను దేశించారు. తరగతి గుదులకు వెళ్లి విద్యార్థులకు ఇంగ్గీష్ పదాల ఉచ్చారణలో గ్రామర్ మెళకువలు నేర్పించారు. వేసవిలో స్టూడెంట్స్​కు కంప్యూటర్ నాలెడ్జ్ పెంచడం కోసం ఖమ్మంలో  50 కంప్యూటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

నార్మల్ డెలివరీలకు ప్రయార్టీ ఇవ్వండి

పెనుబల్లి  : పీహెచ్​సీల్లో నార్మల్ డెలివరీలు చేసేందుకు ప్రయార్టీ ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్లకు సూచించారు. పెనుబల్లి మండలం అడవిమల్లెలలోని పీహెచ్​సీని, లంకాసాగర్ చిన్న తరహా ప్రాజెక్ట్ ను ఆయన పరిశీలించారు. పీహెచ్​సీలో గర్భిణులకు వ్యాయామం, నెలవారీ పరీక్షలు అందిస్తున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. లంకాసాగర్ ప్రాజెక్ట్ వద్ద రైతులతో తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.