
- స్వయంగా వడ్డించిన కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో దివ్యాంగులకు ఉచితంగా మధ్యాహ్న భోజన పథకాన్ని బుధవారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 40 రోజుల క్రితం ప్రజావాణిలో వచ్చిన అభ్యర్థన మేరకు జిల్లా అధికారులతో చర్చించి, దివ్యాంగ అర్జీదారులకు ఉచిత మధ్యాహ్న భోజనం కల్పించాలని నిర్ణయించామన్నారు.
ఖమ్మం నగరానికి కలెక్టరేట్ దూరంగా ఉన్న నేపథ్యంలో దివ్యాంగులకు ఇబ్బందులు కలగవద్దని ఈ ఏర్పాటు చేశామన్నారు. ఒక భోజనంపై రూ. 80 ఖర్చు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా దివ్యాంగులకు అవకాశం
ఖమ్మం జిల్లాలో దివ్యాంగులు గౌరవప్రదమైన జీవనం గడిపేలా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో యూనిక్ డిజెబిలిటీ ఐడెంటిటీ కార్డు (యూడీఐడీ) పొందే విధానంపై దివ్యాంగులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దివ్యాంగులందరికీ వారి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని అన్నారు.
జిల్లాలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నూతనంగా నియమించబడే డేటాఎంట్రీ ఆపరేటర్ లలో దివ్యాంగులకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి మండల తహసిల్దార్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.