మున్నేరు వరద నియంత్రణకు పకడ్బందీ చర్యలు : ముజామ్మిల్​ ఖాన్​

మున్నేరు వరద నియంత్రణకు పకడ్బందీ చర్యలు : ముజామ్మిల్​ ఖాన్​

ఖమ్మం కలెక్టర్ ​ముజామ్మిల్​ ఖాన్​
నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, భూ సేకరణపై సమీక్ష

ఖమ్మం టౌన్, వెలుగు  : మున్నేరు వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, భూసేకరణ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. 

మున్నేరు నది కిరువైపుల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి  బఫర్ జోన్, ఎఫ్ టీఎల్, డిజైన్, గత రికార్డుల ప్రకారం అత్యధిక నీటి ప్రవాహం స్థాయి ఎంత, రిటైనింగ్ వాల్ ఎంత ప్రవాహానికి ఎంత ఎత్తులో నిర్మించాలి లాంటి అంశాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మ్యాప్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు.

మున్నేరు నది వద్ద 3.50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినా తట్టుకునేలా బఫర్ జోన్ నిర్దేశిస్తూ రిటైనింగ్ వాల్ డిజైన్  చేసినట్టు, రికార్డుల ప్రకారం మున్నేరు నది 36 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహించిందని, దానిని పరిగణలోకి తీసుకుంటూ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రణాళికలు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర రావు, ఈఈ అనన్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, ఖమ్మం అర్బన్, రూరల్ తహసీల్దార్లు రవికుమార్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ పరిశీలన 

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను లాభదాయకంగా నడపాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ లోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను అడిషనల్ ​కలెక్టర్ శ్రీజ, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ఆయన పరిశీలించారు. క్యాంటీన్ లో కూర్చొని టీ తాగారు. క్యాంటీన్ నిర్వాహకులతో మాట్లాడుతూ పాత్రలు కడిగేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలన్నారు. 

క్యాంటీన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఉద్యోగుల డిమాండ్ ప్రకారం మెనూ ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు రెండవ అంతస్తులో క్యాంటీన్ ఉన్నట్లు తెలిసేలా ఆవరణలో, బస్ స్టాప్ వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టర్​వెంట డీఆర్డీవో సన్యాసయ్య, అడిషనల్​ డీఆర్డీవో నూరొవుద్దీన్, అధికారులు ఉన్నారు.