
- ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : రెండు వారాల్లో కలెక్టరేట్ లో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై శనివారం కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.కలెక్టరేట్ ను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యాంటీన్ లో కూడా ప్లాస్టిక్ కాకుండా స్టీల్ వస్తువులు మాత్రమే వాడాలని చెప్పారు. సిబ్బందికి స్టీల్ బాటిల్స్ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మండలాల్లోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ నివారణకు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు.
వచ్చేవారం నుంచి గర్ల్ ప్రైడ్ పర్యటనలు ప్రారంభం కావాలన్నారు. జిల్లాలో ఆడపిల్లలు పుట్టిన ఇండ్లకు జిల్లా అధికారులు వెళ్తారని, జిల్లా యంత్రాంగం తరఫున చిన్న సందేశం అందించి రావాలని చెప్పారు. అమ్మాయిలు ఇంట్లో పుట్టటం అదృష్టం అనే భావన ప్రజల్లోకి వెళ్లేలా ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. మిడ్ డే మీల్స్క్వాలిటీపై అధికారుల ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. టెన్త్ స్టూడెంట్స్ ఒత్తిడి లేకుండా ఎగ్జామ్స్రాసేలా అవగాహన కల్పించాలన్నారు. కలెక్టరేట్ లో మెడిటేషన్ సెషన్స్ మధ్యాహ్నం పెట్టేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. మరో రెండు వారాల్లో ప్రభుత్వ సిబ్బందికి రెండోసారి హెల్త్ చెక్ అప్ ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు పి.శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, జెడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్వో ఏ. పద్మశ్రీ, కలెక్టరేట్ ఏవో అరుణ పాల్గొన్నారు.
స్కిల్ హబ్ ద్వారా యువతకు నైపుణ్యాలు
జిల్లాలోని యువత నైపుణ్యతను పెంచేందుకు స్కిల్ హబ్ ఉపయోగపడుతుందని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం రేవతి సెంటర్ వద్ద స్కిల్ హబ్ ఏర్పాటుచేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. స్కిల్ హబ్ లో అందించాల్సిన శిక్షణకు విద్యార్థులు, యువత ఎంపిక, మార్గదర్శకాలను నిర్దేశించడంకోసం కమిటీ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పదో తరగతి, ఇంటర్ తర్వాత ఆసక్తి చూపే పిల్లలకు ఇంగ్లీష్‌లో మాట్లాడటం, కోడింగ్ లో బేసిక్స్ నేర్పించేందుకు వీలుగా స్కిల్ హబ్ లో ఏర్పాటు చేశామన్నారు.
క్లాస్ 4 ఉద్యోగులు, పారిశుధ్య కార్మికుల పిల్లలకు ఉచితంగా కోర్సులు అందించనున్నట్లు చెప్పారు. అనంతరం దివ్యాంగులకు జిల్లా ప్రధాన ఆస్పత్రి వద్ద చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సదరం క్యాంప్ నిర్వహణ సమయంలో దివ్యాంగులకు అవసరమైన వసతులను కల్పించాలన్నారు. దివ్యాంగులకు అందించే యూడీఐడీ కార్డులు రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉపయోగపడతాయని తెలిపారు. ఆస్పత్రిలో వికలాంగత్వం నిర్ధారణ కోసం వచ్చే దివ్యాంగులకు రిసెప్షన్ సెంటర్, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్స్, ర్యాంప్ లాంటి వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.