స్టూడెంట్స్ ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలి : ముజామ్మిల్ ఖాన్

స్టూడెంట్స్ ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలి : ముజామ్మిల్ ఖాన్
  • ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

తల్లాడ, వెలుగు : స్టూడెంట్స్ జీవితంలో ఉన్నతలక్ష్యాలు నిర్దేశించుకుని పట్టుదలతో కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. ఏన్కూర్ లోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజ్ లను ఆయన తనిఖీ చేశారు. స్కూల్​లో డార్మెటరీ హాల్, కిచెన్, భోజనశాల, ప్రహరీ, తరగతి గదులను పరిశీలించారు. రాబోయే ఇంటర్, టెన్త్​ పరీక్షలకు స్టూడెంట్స్ ఎలా సన్నద్ధమవుతున్నారో అడిగి తెలుసుకున్నారు. సెల్​ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలని, పూర్తి సమయం పరీక్షలకు సిద్ధం అయ్యేందుకే కేటాయించాలని సూచించారు.

ఇందిరమ్మ ఇండ్లు నాణ్యతతో నిర్మించుకోవాలి

నిధులు సద్వినియోగించుకొని నాణ్యతతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని కలెక్టర్ లబ్ధిదారులకు సూచించారు. ఏన్కూరు మండలం రేపల్లెవాడ గవర్నమెంట్ స్కూల్​ ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు నచ్చిన విధంగా నిర్మించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇసుక, సిమెంట్, ఇటుక తదితర మెటీరియల్ పై లబ్ధిదారుల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఇండ్ల నిర్మాణం కోసం ఇసుకను ప్రతి మండల కేంద్రంలోకి తీసుకువచ్చే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకుంటుందని, ఇంటి నిర్మాణానికి తక్కువ ధరకే ఇసుక తరలించేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సిమెంట్ కూడా ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ ధరకు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రేపల్లెవాడ గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నందున వాటిని పట్టుకొని ఖమ్మంలో ఉన్న అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్​లో వాటికి ఆపరేషన్ చేయించాలని ఎంపీడీవోను ఆదేశించారు.

ప్రజలు  సుఖసంతోషాలతో ఉండాలి 

ఖమ్మం రూరల్​ : జిల్లాలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని తీర్థాల సంగమేశ్వరస్వామిని ప్రార్థించినట్లు కలెక్టర్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతరలో కల్పించిన వసుతలపై భక్తులను ఆరా తీశారు. అనంతరం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, అర్చకులు  కలెక్టర్ ను శాలువాతో సత్కరించి, ప్రసాదం అందజేశారు.  కలెక్టర్ వెంట రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు ఉన్నారు.