అర్జీలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

అర్జీలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి అర్జీలను స్వీకరించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతీ శుక్రవారం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష ఉంటుందని తెలిపారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల్లో స్పష్టత లేకపోతే సరైన కారణాలు తెలుపుతూ సమాధానం రాయాలని, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని సూచించారు. 

రైతుల వినతి

ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రెవెన్యూ లో 60 సంవత్సరాల నుంచి దళితులు, పేద రైతులు సాగు చేస్తున్న భూముల్లో నుంచి ఖాళీ చేపించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు గ్రీవెన్స్ లో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. అక్కడ పరిస్థితిని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, సీఐటీయూ జిల్లా నాయకులు పెరుమాలపల్లి మోహన్ రావు కలెక్టర్​కు వివరించారు. 

తల్లాడ : తల్లాడ మండలంకేశవాపురంలో 2021 సంవత్సరంలో గత ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లపై విచారణ జరిపించాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ తల్లాడ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. నాలుగేండ్లలోనే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలా వ్యవస్థకు చేరాయని, నివాసముంటున్న పేదలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మండలంలో ధాన్యం కొనుగోలు త్వరగా ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.