తప్పుడు అసెస్మెంట్లతో ఆస్తి పన్ను ఎగ్గొడుతున్రు!ఖమ్మంలో బడా వ్యాపారవేత్తల బాగోతం

తప్పుడు అసెస్మెంట్లతో  ఆస్తి పన్ను ఎగ్గొడుతున్రు!ఖమ్మంలో బడా వ్యాపారవేత్తల బాగోతం
  • ఖమ్మం కార్పొరేషన్​లో బడా వ్యాపారవేత్తల బాగోతం 
  • రెసిడెన్షియల్ పర్మిషన్, కమర్షియల్ గా వినియోగం 
  • ఒక డివిజన్​లో థర్డ్ పార్టీ సర్వేతో బయటపడ్డ మోసం
  • మిగతా అన్ని డివిజన్లలో సర్వే చేయించాలని నిర్ణయం 
  • పెరగనున్న మున్సిపల్ కార్పొరేషన్​ ఆదాయం 

ఖమ్మం, వెలుగు :  ఖమ్మం సిటీలో చాలా మంది వ్యాపారవేత్తలు, బడాబాబులు మున్సిపల్ కార్పొరేషన్​ ఆదాయానికి గండి కొడుతున్నారు. రూ.కోట్ల విలువైన కమర్షియల్ భవనాలు నిర్మించుకొని, నెలకు రూ.లక్షల్లో కిరాయి రూపంలో వసూలు చేస్తూ ప్రభుత్వానికి కట్టాల్సిన ఆస్తి పన్నుకు మాత్రం టోకరా పెడుతున్నారు. ఎప్పుడో ఏండ్ల కింద నిర్మించిన పాత భవనాలు, ఆ కొలతలతోనే చేసిన అసెస్మెంట్ ప్రకారం ఆస్తి పన్నులు కడుతున్నారు. అవే స్థలాల్లో కొత్తగా పెద్ద భవనాలు కట్టినా, ఎలాంటి అనుమతులు లేకుండానే అదనపు అంతస్తులు నిర్మించినా వాటికి మాత్రం పన్ను కట్టడం లేదు.

ఇలా నగరంలోని అత్యంత ఖరీదైన కమర్షియల్ భవనాలున్న వైరా రోడ్డు, కస్బా బజార్​ లో కూడా చాలా భవనాల యజమానులు ట్యాక్స్​ఎగ్గొడుతున్నారు. ఇలాంటి వారందరికీ చెక్​పెట్టేందుకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​అధికారులు కొత్త ప్లాన్​ సిద్ధం చేశారు. ఇప్పటి వరకు ఉన్న అసెస్మెంట్లను చెక్ చేసి, రీ అసెస్మెంట్లు వేయాలని నిర్ణయించారు. దీని ద్వారా కార్పొరేషన్​ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఇక అన్ని డివిజన్లలో సర్వే..

ఖమ్మంలో ఆస్తి పన్నుల విషయంలో జరుగుతున్న అవకతవకలు, భవన యజమానులు చేస్తున్న అక్రమాలు, కార్పొరేషన్​ సిబ్బంది మోసాలపై ఇటీవల మున్సిపల్ అధికారులు నజర్ పెట్టారు. సిటీలో ఉన్న ఆస్తులకు తగిన విధంగా పన్నులు వసూలు కావడం లేదనే అంచనాకు వచ్చారు. పక్కాగా దీన్ని నిర్ధారించుకునేందుకు 43వ డివిజన్​ లో థర్డ్ పార్టీ ఏజెన్సీతో సర్వే చేపట్టారు. ప్రస్తుతం రెవెన్యూ విభాగం లెక్కల ప్రకారం ఆ డివిజన్​ లో 500 వరకు అసెస్మెంట్లకు రూ.1.20 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా వాస్తవానికి అంతకు రెట్టింపు సంఖ్యలో అసెస్మెంట్లు ఉన్నాయని గుర్తించారు.

అసెస్మెంట్లు లేకపోవడం, కొన్నింటికి తక్కువగా కొలతలు వేయించిన విషయాన్ని పసిగట్టారు. సర్వే ద్వారా ఆ డివిజన్​ లోని ఆస్తులను రీ అసెస్మెంట్ చేశారు. దీంతో ఇంకో రూ.60 లక్షల అదనపు ఆదాయం వచ్చింది. దీంతో అన్ని డివిజన్లలో రీ అసెస్మెంట్ ప్రక్రియ చేపట్టాలని కార్పొరేషన్​ అధికారులు నిర్ణయించారు. రెండు వారాల కింద జరిగిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ బడ్జెట్ సమావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్​ లు తీసుకోకపోవడం, రిజిస్ట్రేషన్​ చేయించకపోవడంతో వీటిపైనా రీ సర్వే చేయించాలని డిసైడయ్యారు. 

పెరగనున్న రూ.6 కోట్ల ఆదాయం..!

ఖమ్మం కార్పొరేషన్​ లో 82,148 అసెస్మెంట్లు ఉండగా, ఇందులో 74,271 రెసిడెన్షియల్, 3,700 కమర్షియల్ భవనాలున్నాయి. మరో 4,177 రెసిడెన్షియల్ కమ్​ కమర్షియల్ గా ఉన్నాయి. వీటి ద్వారా రూ.35 కోట్ల ఆస్తిపన్నులు వస్తుండగా, రీ అసెస్మెంట్ పూర్తయితే అదనంగా మరో రూ.6 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా 43వ డివిజన్​ లో రీ అసెస్మెంట్ చేసిన సమయంలో ఆయా భవనాలను కొలతలను తీసుకొని గూగుల్ మ్యాపింగ్ ద్వారా జియో ట్యాగింగ్ చేశారు. ఇదే తరహాలో అన్ని డివిజన్లలోనూ త్వరలోనే రీ అసెస్మెంట్ సర్వే నిర్వహించనున్నారు.  

ఖమ్మం సిటీలోని 43వ డివిజన్​లో ఐదు అంతస్తుల్లో ఉన్న అపార్ట్ మెంట్ లో నగరంలోని అతిపెద్ద వాణిజ్యసంస్థల్లో ఒకదానికి గోడౌన్​ ఉంది. దానికి రెండు ఇంటి నెంబర్లతో అనుమతులు ఉండగా, రెండింటికీ కలిపి ఏడాదికి కేవలం రూ.1,250 మాత్రమే ఆస్తి పన్ను రూపంలో చెల్లిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు, హాస్టళ్లు కూడా రెసిడెన్షియల్​ పర్పస్​ లో అనుమతులు తీసుకున్న భవనాల్లోనే నిర్వహిస్తూ రూ.లక్షల్లో ఆస్తి పన్ను ఎగ్గొడుతున్నారు.

నెహ్రూ నగర్​ లో ఉన్న వందలాది బిల్డింగుల్లో ఆస్పత్రులు, షాపులు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నా అక్కడ ఆస్తి పన్ను మాత్రం తక్కువగానే కడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ఆఫీస్​ కు ఎదురుగా ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ఒక మెడికల్ అకాడమీని రెండు, మూడేళ్లుగా నిర్వహిస్తున్నారు. దాన్ని ఆనుకొని ఉన్న మరో బిల్డింగ్ లో హాస్టల్ కూడా నడుపుతున్నారు. వాటికి కూడా వాణిజ్యపరమైన అనుమతుల్లేవు. ​