చెత్త పోయి చెట్లొచ్చె! ఖమ్మంలో కనిపిస్తున్న బయో మైనింగ్ ఫలితాలు

చెత్త  పోయి చెట్లొచ్చె! ఖమ్మంలో కనిపిస్తున్న బయో మైనింగ్ ఫలితాలు
  • దానవాయిగూడెం డంపింగ్ యార్డులో మొక్కలు
  • బయో మైనింగ్ తో క్లియర్​అయిన పదెకరాల భూమి 
  • 8 ఎకరాల్లో దాదాపు 8 వేల మొక్కల పెంపకం స్టార్ట్
  • టన్నుకు రూ.550 చొప్పున ప్రైవేట్ సంస్థకు చెల్లింపు

ఖమ్మం, వెలుగు: గుట్టలా పేరుకుపోయిన చెత్తను రీసైక్లింగ్ చేయడంతో బయో మైనింగ్ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం మున్సిపల్​కార్పొరేషన్​పరిధిలోని దానవాయిగూడెం డంపింగ్ యార్డులో రెండున్నరేళ్లుగా బయో మైనింగ్ చేస్తున్న కారణంగా పదెకరాల భూమి తేలింది. 38 ఎకరాల్లో విస్తరించి ఉన్న డంపింగ్ యార్డులో ఇప్పటివరకు1.20 లక్షల మెట్రిక్​ టన్నుల లెగసీ వేస్ట్ ను క్లియర్​చేశారు. 

దీంతో ఖాళీ అయిన పదెకరాల ప్లేస్​ను మున్సిపల్ సిబ్బందికి అప్పగించగా, అందులో మొక్కల పెంపకం ప్రారంభించారు. ఇటీవల 8 ఎకరాల్లో సుమారు 8 వేల మొక్కలను నాటారు. ఇందులో పండ్ల మొక్కలు కూడా ఉన్నాయని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. మరో 2 వేల మొక్కలను దశలవారీగా నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాటిన మొక్కలను కాపాడుకునేందుకు బోరు ఏర్పాటుచేసి మోటార్​ బిగించడంతో పాటు గార్డెనింగ్ సిబ్బందిని కూడా నియమించారు. 

నత్తనడకన బయో మైనింగ్..

ఖమ్మం కార్పొరేషన్​ పరిధిలో చాలా ఏళ్లుగా దానవాయి గూడెం డంపింగ్ యార్డులో 2.75 లక్షల మెట్రిక్​ టన్నుల లెగసీ వేస్ట్ ను క్లియర్​ చేసేందుకు రెండున్నరేళ్ల  క్రితం ఏపీకి చెందిన ఒక  ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. మెట్రిక్​ టన్నుకు రూ.550 చొప్పున మొత్తం చెల్లిస్తున్నారు.  రెండేళ్లలో మొత్తం పని కంప్లీట్ చేయాలని ఒప్పందం చేసుకున్నా, ఇప్పటి వరకు అందులో సగం కూడా పూర్తి కాలేదు.  మొత్తం 38  ఎకరాలకు  28  ఎకరాల్లో 1.55  లక్షల మెట్రిక్​ టన్నుల  లెగసీ వేస్ట్ ఉండగా,  మొత్తం వర్క్​ కంప్లీట్ కావడానికి ఇంకో రెండేళ్లు పట్టే అవకాశం కనిపిస్తోంది.  

 రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ మిషన్​ కింద రూ.176  కోట్లతో 123 అర్బన్​లోకల్​ బాడీస్ లో బయో మైనింగ్ చేస్తున్నారన్నారు.  ఇందులో ఖమ్మంలోనే  స్పీడ్‌గా వర్క్​ జరుగుతోందని మున్సిపల్​అధికారులు చెబుతున్నారు.  గత ఎండాకాలంలో అగ్ని ప్రమాదం జరగడం, భారీ వర్షాలు, వరదల కారణంగా పని ఆలస్యమైందని అంటున్నారు. ఏడాదిలోగా మిగిలిన లెగసీ వేస్ట్ ను కూడా క్లియర్​ చేస్తామని వివరిస్తున్నారు.  

బయో మైనింగ్ అంటే..!

డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్తను ప్రత్యేక మెషీన్ల ద్వారా రీ సైకిల్ చేయడమే బయో మైనింగ్. 100 మిల్లీ మైక్రాన్ల (ఎంఎం) కంటే ఎక్కువ పరిమాణం ఉన్న వ్యర్థాలు అంటే పెద్ద ప్లాస్టిక్​బాటిళ్లు, కొబ్బరి బొండాలు, రాళ్లు, దుస్తుల వంటి వాటితో పాటు ప్లాస్టిక్​మెటీరియల్​లోనూ రీ సైక్లింగ్ చేయగలిగినవి వివిధ దశల్లో బయటకు వస్తాయి. ఆయా డంప్​ యార్డుల్లోని చెత్తను పూర్తిగా ఖాళీ చేసి, బయటపడిన భూమిని ప్రభుత్వానికి అప్పగించాలి.  ఖమ్మంలో బయో మైనింగ్ కోసం దాదాపు రూ.15 కోట్లు ఖర్చు అవుతుండగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం 33 శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వం 67 శాతం వాటా ఖర్చును భరిస్తున్నాయి. 

రోజూ180  మెట్రిక్​టన్నుల చెత్త

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​లో 60 డివిజన్లు ఉండగా, 4 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇంటింటికి తిరుగుతూ సేకరించిన చెత్తను 78 ట్రాక్టర్లు, 85 ఆటోల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతిరోజూ దాదా పు180 మెట్రిక్​ టన్నుల చెత్త జనరేట్ అవుతుంది. త్వరలోనే చెత్తను తడి, పొడిగా వేరు చేసేలా కొత్త ప్రాజెక్టు ప్లాన్​ చేస్తున్నారు. ఇందుకు రూ.25 కోట్లతో డీపీఆర్​ను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.