ఖమ్మంలో పర్మిషన్ లేని క్లినిక్​ల సీజ్

  • పేద ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దు
  • జిల్లా డీఎంహెచ్ వో డాక్టర్ బి.కళావతి బాయి 

ఖమ్మం టౌన్, వెలుగు : ఎలాంటి పర్మిషన్లు లేకుండా వైద్యం చేస్తున్న రెండు క్లీనిక్ లను ఖమ్మం జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ట్రంక్ లో ఆంక్యుపంక్చర్ క్లినిక్ ను డీఎంహెచ్ వో డాక్టర్ బి.కళావతి బాయి వైద్య సిబ్బందితో వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ గా వైద్యం చేస్తున్న  వై.నరేశ్ కుమార్ కు ఎలాంటి అర్హలు లేవని గుర్తించి క్లినిక్ ని సీజ్ చేసి త్రీ టౌన్ సీఐకి ఫిర్యాదు చేశారు. 

అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ లో కేరళ వైద్యం పేరిట ఉన్న క్లినిక్ ని తనిఖీ చేసి సీజ్ చేశారు. పేద ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని,  అలాంటివారి ఉచ్చులో పడి ప్రజలు ప్రాణాలు కోల్పోవద్దని డీఎంహెచ్ వో  పేర్కొన్నారు. ఆ తర్వాత జిల్లా ఆస్పత్రిలోని ఎన్సీడీ క్లినిక్ ను సందర్శించి చికిత్సలపై ఆరా తీశారు. డీఎంహెచ్ వో వెంట వైద్యాధికారులు చందునాయక్, డి.రామారావు ఉన్నారు.