డెంగీ.. యమ డేంజర్!​.. పొంచి ఉన్న విషజ్వరాల ముప్పు

  • ఖాళీ స్థలాలపై మాత్రం ఫోకస్​ పెట్టని ఆఫీసర్లు
  • పెరిగిపోతోన్న కేసులుదోమలకు నిలయాలుగా ఖాళీ ప్లాట్లు
  • డ్రై డే పేరుతో కార్యక్రమాల నిర్వహణ

ఖమ్మం, వెలుగు:  ఏటా వర్షాకాలం వచ్చిందంటే విష జ్వరాలు వేధిస్తుంటాయి. ప్రస్తుత సీజన్​లోనూ డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 35కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఇంతకంటే ఎక్కువగానే కేసులు ఉన్నాయన్న అనుమానాలున్నాయి. రెండు, మూడేళ్లుగా కోవిడ్ కారణంగా కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా ఈ ఏడాది వచ్చిన వరదల కారణంగా విష జ్వరాల టెన్షన్​పట్టుకుంది. మరోవైపు జిల్లాస్థాయిలో అధికారులు ఫ్రై డే, డ్రై డే పేరుతో ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. గతంలో మంగళవారం కూడా డ్రై డే నిర్వహించినా, అధికారులు మిగిలిన పనులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు శుక్రవారానికి మాత్రమే డ్రై డేను పరిమితం చేశారు. పట్టణాలు, గ్రామాల్లోని కాలనీల్లో తిరుగుతూ ప్రజలకు దోమల వ్యాప్తి జరగకుండా, ఇండ్లలోని పూల కుండీలు, పాత టైర్లు, కూలర్లు, పాత కుండలు, నీళ్ల ట్యాంకులు ఎప్పటికప్పుడు క్లీన్​ చేయాలని చెప్పుతున్నారు. అదే సమయంలో దోమలకు నిలయాలుగా మారిన ఖాళీ స్థలాలపై మాత్రం ఆఫీసర్లు నజర్​పెట్టడం లేదు. 

యజమానులకు వార్నింగ్​ఇచ్చినా...

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం నగరంతో పాటు, మున్నేరును ఆనుకొని రూరల్ మండలంలో భారీగా వరద నీరు చేరింది. దీంతో ఇండ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాలు ఇప్పటికీ నిండా నీళ్లతోనే కనిపిస్తున్నాయి. వర్షాలు ఆగిపోయి వారం దాటుతున్నా, నిల్వ ఉన్న నీరు మాత్రం తగ్గడం లేదు. ప్రైవేట్ వెంచర్లతోపాటు గతంలో వేసిన లే అవుట్లలో కూడా చాలాచోట్ల ఇండ్ల నిర్మాణం జరగలేదు. దీంతో వర్షం పడగానే ఆయా ప్లాట్లలో చేరిన నీరు, బయటకు వెళ్లే మార్గం లేక నిల్వ ఉంటోంది. సుమారు రెండేళ్ల క్రితం ఖమ్మం కార్పొరేషన్ లిమిట్స్​లో ఉన్న ఖాళీ ప్లాట్ల యజమానులకు మున్సిపల్ ఆఫీసర్లు నోటీసులిచ్చారు. ప్లాట్లలో నీళ్లు చేరకుండా మట్టి పోయించాలని, లేదంటే తామే మట్టి పోయించి అయిన ఖర్చు కంటే డబుల్ వసూలు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనికి కొందరు స్పందించగా, మరికొందరు లైట్ తీసుకున్నారు. లోతట్టు కాలనీల్లో ప్రస్తుతం ప్లాట్లలో నిలిచి ఉన్న నీళ్లలోకి పాములు, దోమలు చేరడం స్థానికులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఖమ్మంను ఆనుకొని ఉన్న టీఎన్జీవోస్​కాలనీ, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్​కాలనీ, నాయుడుపేట, కేబీఆర్ నగర్, పెద్దతండా, వరంగల్ క్రాస్ రోడ్ తోపాటు దాదాపు అన్ని శివారు కాలనీల్లో ప్లాట్లు ఖాళీగా ఉండడం సమస్యగా మారుతోంది. 

కార్మికుల సమ్మె కూడా ఎఫెక్ట్...​

ప్రస్తుత సీజనల్​జ్వరాలతోపాటు గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో రెండు వారాలుగా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులకే కాకుండా ప్రైవేట్​కు కూడా వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ఒకవైపు కండ్ల కలక విపరీతంగా వ్యాప్తి చెందగా, పిల్లలు, పెద్దలు ఇప్పటికే బాధపడుతున్నారు. అదే సమయంలో విష జ్వరాలు కూడా మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ వీపీ గౌతమ్ ​ఇప్పటికే సమీక్షల్లో ఆదేశాలిస్తున్నారు. స్వయంగా ఆయన కూడా ఫ్రైడే, డ్రైడే ప్రోగ్రాంలల్లో పాల్గొంటున్నారు. దోమలు పెరుగుదలకు కారణమవుతున్న ఖాళీ ప్లాట్ల విషయంలోనూ చర్యలు తీసుకోకుంటే పరిస్థితి చేయిదాటే ప్రమాదం కనిపిస్తోంది.

విష జ్వరాలపై చర్చించాం...

తాను ఇటీవలే ఇక్కడికి బదిలీపై వచ్చా. ఇప్పటికే జీపీ కార్యదర్శులతో సమావేశంలో విషజ్వరాల వ్యాప్తి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం. ఖాళీ ప్లాట్లలో నీళ్లు నిల్వ ఉండకుండా స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వాలని సెక్రటరీలకు సూచిస్తాం.  

బి. రవీందర్ రెడ్డి, ఎంపీడీవో, ఖమ్మం రూరల్