ఖమ్మం జిల్లాలో మొదటి పామాయిల్ ఫ్యాక్టరీ!

ఖమ్మం జిల్లాలో  మొదటి పామాయిల్ ఫ్యాక్టరీ!
  • ఉగాది రోజు శంకుస్థాపన చేయనున్న మంత్రి తుమ్మల
  • వేంసూరు మండలం కల్లూరిగూడెంలో ఏర్పాటు
  • 48 ఎకరాల్లో, రూ.250 కోట్లతో నిర్మాణం 

ఖమ్మం/ పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లాలో తొలి పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలం కల్లూరిగూడెంలో కొత్తగా పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు 48 ఎకరాలు కేటాయించారు. 

ఈనెలలో ఉగాది పండుగ రోజున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఆయిల్ ఫెడ్​ ఆధ్వర్యంలో రూ.250 కోట్లతో, గంటకు 60 టన్నుల సామర్థ్యంతో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించారు. అత్యాధునిక టెక్నాలజీతో ముందుగా గంటకు 15 టన్నుల కెపాసిటీతో నిర్మించి, భవిష్యత్​ లో దాన్ని 60 టన్నులకు పెంచనున్నారు. 

రెండు ఫ్యాక్టరీలు మంజూరు.. 

రాష్ట్రంలో ఆయిల్ పామ్​ సాగును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా రైతులకు ఆయిల్ పామ్​ సాగుపై అవగాహన కల్పిస్తూ, సాగు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో, అప్పారావుపేటలో రెండు పామాయిల్ ఫ్యాక్టరీలు ఉండగా, ఖమ్మం జిల్లాలో మాత్రం లేవు. దీంతో ఖమ్మం జిల్లాలో రైతులను ప్రోత్సహించేందుకు రెండు పామాయిల్ ఫ్యాక్టరీలను మంజూరు చేశారు. అందులో ఒకటి ఆయిల్ ఫెడ్​ ఆధ్వర్యంలో వేంసూరు మండలం కల్లూరిగూడెంలో, మరొకటి ప్రైవేట్ కంపెనీ గోద్రెజ్​ అగ్రోవెట్ ఆధ్వర్యంలో కొణిజర్ల మండలం అంజనాపురంలో ఏర్పాటు చేస్తున్నారు. 

కల్లూరిగూడెంలో ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసి ఆయిల్ ఫెడ్ కు అందజేయగా, భూమి చుట్టూ ఫెన్సింగ్ ను ఏర్పాటుచేశారు. ఉగాది పండుగ రోజు శంకుస్థాపన చేసేందుకు అప్రోచ్​ రోడ్డును నిర్మిస్తున్నారు. ఫ్యాక్టరీలో అవసరమైన మిషనరీని ఇండోనేషియా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇక ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ.87 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో మెకానికల్ పనులకు రూ.53 కోట్లు, సివిల్, ఎలక్ట్రికల్ పనులకు రూ.34 కోట్లు కేటాయించనున్నారు. 

ఉమ్మడి జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు.. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 30 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ విస్తరించి ఉండగా 15 వేల ఎకరాలలో ఇప్పటికే దిగుబడి వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి లక్ష టన్నుల ఆయిల్ పామ్ గెలలు దిగుబడి అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో మండలాలను ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేయనున్న రెండు ఫ్యాక్టరీలకు విభజన చేశారు.

 ఖమ్మం జిల్లాలో మొత్తం 21 మండలాలుండగా సత్తుపల్లి, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, వైరా, బోనకల్, చింతకాని, కూసుమంచి, నేలకొండపల్లి, ఎర్రుపాలెం మండలాలు ఆయిల్ ఫెడ్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీకి కేటాయించగా, మిగిలిన 11 మండలాలను కొణిజర్ల మండలం అంజనాపురం ఫ్యాక్టరీకి కేటాయించారు. 

కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తయిన తర్వాత ఎవరికి కేటాయించిన మండలాల్లోని ఆయిల్ పామ్​ పంటను వారు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కల్లూరిగూడెం ఫ్యాక్టరీని వచ్చే ఏడాది చివరి నాటికి కంప్లీట్ చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు పట్ల స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి దొరకుతుంది.. 

మా ఊరిలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు, కూలీలకు ఉపాధి దొరుకుతుంది. ప్రస్తుతం ఇక్కడి రైతులు పండిస్తున్న ఆయిల్ పామ్ ను అశ్వారావుపేటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. దీంతో రవాణాకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇక్కడే ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే రవాణా ఖర్చుతో పాటు మాకు సమయం కూడా ఆదా అవుతుంది. ఫ్యాక్టరీ నిర్మాణానికి మా గ్రామాన్ని ఎంచుకున్నందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రుణ పడి ఉంటాం. – నరసింహారావు, కల్లూరుగూడెం