ఖమ్మం అటవీ సర్కిల్ కు వందేళ్లు..

ఖమ్మం అటవీ సర్కిల్ కు  వందేళ్లు..
  • ఘనంగా శతజయంతి ఉత్సవాలకు ప్లాన్​
  • స్పీడ్​గా ఎకో టూరిజం అభివృద్ధి పనులు

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లా అటవీ శాఖ కార్యాలయం వందేళ్లు పూర్తి చేసుకుంది. 1925లో నిజాం నవాబుల పాలనలో ఈ ప్రాంతంలో అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ఖమ్మం సర్కిల్ ను ఏర్పాటు చేసి, అప్పటి డివిజనల్ ఫారెస్ట్ అధికారి కోసం ఖమ్మం ట్రంక్​ రోడ్డులో ఆఫీస్​ నిర్మించారు. ఇప్పుడు వందేళ్లు పూర్తి కావడంతో ఖమ్మం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్​ చేశారు. గవర్నమెంట్ స్కూల్, కాలేజీ విద్యార్థులతో ఈ వారంలో అర్బన్​ పార్కుల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

తర్వాత కనిగిరి గుట్టల్లోని పులిగుండాల ప్రాజెక్టు దగ్గర కూడా విజిట్​ ప్రోగ్రామ్​ నిర్వహించేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఇదే సందర్భంగా కనకగిరి కొండల్లో ఉన్న పక్షులు, వన్యప్రాణుల లెక్క తేల్చేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. ఖమ్మం ఫారెస్ట్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న, రిటైర్​ అయిన అధికారులు, సిబ్బందితో ప్రత్యేక వేడుక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 

అప్పట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో..

ప్రస్తుత ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం అప్పట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. అప్పటి ఖమ్మం ఆఫీస్​ కేంద్రంగా తూర్పున అశ్వారావుపేట ప్రాంతం, దక్షిణాన ఎర్రుపాలెం, ఉత్తరాన వాజేడు, పశ్చిమాన పాలేరుతో పాటు ప్రస్తుతం ఏపీలో ఉన్న తిరువూరు అటవీ ప్రాంతం కూడా ఖమ్మం అటవీ డివిజన్​లో భాగంగా ఉండేది. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండడం, క్రమంగా ప్రత్యేక పర్యవేక్షణ అవసరం ఎక్కువ కావడం, అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం వేర్వేరుగా పని విభజన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అటవీ శాఖలో కొత్త సర్కిళ్లు ఏర్పడ్డాయి. 

ఖమ్మం, సూర్యాపేట జిల్లాలను కలిపి ఖమ్మం ఫారెస్ట్ సర్కిల్ గా ఏర్పాటు చేశారు. ఇప్పుడు జిల్లా అటవీశాఖ అధికారి నేతృత్వంలో ఖమ్మం, సత్తుపల్లి అటవీ డివిజన్లున్నాయి. డివిజన్లను రేంజ్​ లుగా, రేంజ్​ లను సెక్షన్​లుగా, సెక్షన్​ లను బీట్ లుగా విభజించి అడవిని సంరక్షిస్తున్నారు. 2022లో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు అటవీశాఖ సర్కిల్ కార్యాలయాన్ని తరలించి భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ లో విలీనం చేయగా, ప్రస్తుతం ఖమ్మం జిల్లా భద్రాద్రి జోన్​ లో భాగంగా సర్కిల్ కార్యాలయం వరంగల్ లో ఉంది.  

ఎకో టూరిజం కోసం రెండు మెగా ప్రాజెక్టులు..

ప్రస్తుతం అటవీ శాఖ ద్వారా ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం కోసం రెండు మెగా ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు. మధిర నియోజకవర్గం జమలాపురంలో ఎకో పార్కుకు ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. కనకగిరి గుట్టల్లో ఎకో టూరిజం ఏర్పాటు చేసి, ఫారెస్ట్ సఫారీని ఫిబ్రవరి 15న ప్రాథమికంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.