మామిడి రేటు డౌన్ .. మొదట్లో టన్నుకు రూ.60 వేలు

మామిడి రేటు డౌన్ .. మొదట్లో టన్నుకు రూ.60 వేలు
  • అకాల వర్షాల తర్వాత రూ.30 వేల దిగువకు పడిపోయిన ధర
  • మామిడి కాయకి మంగు రావడంతో దక్కని రేటు
  • ఈ ఏడాది దిగుబడి కూడా అంతంతమాత్రమే

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మామిడి రైతులకు ఈ ఏడాది కూడా నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.  కాయ చేతికందే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలతో మామిడి రేటు ఒక్కసారిగా పడిపోయింది. ఇప్పటికే పూత, పిందెల సమయంలో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు వ్యాపారులు రేటు తగ్గించడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండు వారాల క్రితం వరకు టన్నుకు రూ.50 వేల నుంచి 60 వేల వరకు పలికిన మామిడి కాయ రేటు, ఇప్పుడు రూ.30 వేలకు మించడం లేదు. మొన్నటి ఈదురుగాలుల బీభత్సం, రాళ్ల వర్షాల కారణంగా చాలా వరకు తోటల్లో కాయలు, పిందెలు రాలిపోయాయి. 

చెట్లపై మిగిలిన కాయకు మంగు రావడంతో క్వాలిటీ లేదంటూ వ్యాపారులు రేటు తగ్గించేశారు. దీంతో తోటలను కౌలుకు తీసుకొన్న రైతులకు కన్నీరే మిగులుతోంది. ఖమ్మం జిల్లాలో 32 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా బంగినపల్లి రకంతో పాటు కేసరి, హిమాయత్, తోతాపురి, చిన్న, పెద్ద రసాలు, సువర్ణరేఖ, నీలం, చెరుకురసం లాంటి రకాలు ఉమ్మడి జిల్లాలో పండిస్తున్నారు. చాలా మంది తోటల యజమానులు ముందుగానే కౌలుకు ఇచ్చేస్తారు. ఎకరానికి తోటలో ఉన్న చెట్లను బట్టి రూ.50 వేల నుంచి 60 వేల వరకు కౌలు రేటు పలుకుతోంది. 

తోట దక్కించుకున్న కౌలు రైతులు మందులతో పాటు కూలీ ఖర్చులు ఇతర పెట్టుబడులు కలుపుకొని లాభం ఆశిస్తారు. పంట చేతికి అందగానే ఊర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ మండి (పెద్ద షెడ్లతో ఏర్పాటు చేసే మామిడి కొనుగోలు కేంద్రం)ల్లోనే సరుకు అమ్మేస్తున్నారు. హైదరాబాద్​ మార్కెట్ కు తరలిస్తే ఎక్కువ రేటు వచ్చే అవకాశమున్నా, ఆ ధర కాస్తా ట్రాన్స్ పోర్ట్ ఖర్చులకే సరిపోతుండడంతో స్థానికంగా అమ్మేందుకే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం మంగు వచ్చిన మామిడికాయల రేటు టన్నుకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు నడుస్తుంది. కొంచెం క్వాలిటీ ఉన్న కాయలు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు టన్ను రేటు ఉంది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కౌలు రైతులు వాపోతున్నారు.  

వర్షం దెబ్బకు సగం రేట్ పడిపోయింది 

మామిడి రేటు మార్చి నెలలో అత్యధికంగా టన్ను రూ.90 వేలు ఉంది. మార్చి నెలాఖరు నాటికి రూ.70 వేలకు తగ్గింది. గత వారం కురిసిన వర్షాలకు నాకున్న 10 ఎకరాల్లో  సగం మామిడి రాలిపోగా ఉన్న కాయలకు అయినా రేట్ వస్తుందనుకున్నా. వర్షాల తర్వాత  రూ.30 వేలకు పడిపోయింది. మంగు వచ్చిందని మార్కెట్ లో రేట్ రావడం  లేదు.- పసుమర్తి విశ్వనాధ్, మామిడి రైతు, పెనుబల్లి 

ధర లేదు, దిగుబడి లేదు

మామిడి కాయలకు ఈసారి మార్కెట్ లో ధర లేదు.  ఆశించిన స్థాయిలో దిగుబడి లేదు. పెట్టుబడులు రావడం కష్టంగా ఉంది. ఈ ఏడాది 50 ఎకరాలు కౌలు తీసుకొని కాయ వచ్చే వరకు ఎకరానికి రూ.2 లక్షలు పెట్టుబడిగా పెట్టాను. అకాల వర్షం, నల్లిపురుగు, తెగుళ్ళు ఆశించి పిందె మాడి రాలిపోవడంతో ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గింది. 

చందర్ రావు, కౌలు రైతు, కొత్తగూడెం