మునుగోడులో కిషన్ రెడ్డి జోరుగా ప్రచారం

రాష్ట్రంలో  కల్వకుంట్ల ఫ్యామిలీ పెత్తనం లేకుండా చేయాలంటే మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజల సొమ్ముతో సీఎం కేసీఆర్ సొంతంగా విమానం కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నారంటే రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. కేసీఆర్ కుటుంబం భూ కుంభకోణాలు,ఇసుక,లిక్కర్ వంటి స్కామ్ లు చేస్తూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.  రాష్ట్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. 

 దేశ ప్రజలకు ఉచిత కరోనా వ్యాక్సినేషన్ ద్వారా కోట్లాది మంది ప్రాణాలను కాపాడిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. గ్రామ పంచాయితీల అభివృద్ధికి  రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనే గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందన్నారు. మంత్రి కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇన్నిరోజులు గుర్తుకురాని మునుగోడును ఉపఎన్నికలు వస్తేనే గుర్తుకు వస్తాయా అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కిష్టాపురంలో  కేంద్ర మంత్రికి  గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ పాల్గొన్నారు.