గడ్కరీతో కిషన్ రెడ్డి భేటీ : కిషన్ రెడ్డి

గడ్కరీతో కిషన్ రెడ్డి భేటీ : కిషన్ రెడ్డి
  1. చర్చించిన అంశాలను వెల్లడించేందుకు నిరాకరణ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న వేళ.. ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. గడ్కరీ అధికారిక నివాసం మోతీలాల్ నెహ్రూ ప్యాలెస్ 2లో ఈ సమావేశం జరిగింది. దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన ట్రిపుల్ ఆర్, నేషనల్ హైవే ప్రాజెక్టులపై చర్చించినట్టు తెలిసింది. 

అయితే ఈ భేటీకి సంబంధించిన వివరాలను కిషన్‌‌‌‌రెడ్డి కార్యాలయం మీడియాకు వెల్లడించలేదు. సమావేశం జరుగుతున్నట్టు సమాచారం బయటకు రావడంతో మీడియా ప్రతినిధులు గడ్కరీ నివాసానికి చేరుకున్నారు. కానీ ఈ భేటీపై స్పందించేందుకు కిషన్ రెడ్డి నిరాకరించారు. కాగా, ఈ భేటీ విషయమై కిషన్ రెడ్డి కార్యాలయాన్ని సంప్రదించగా.. మీటింగ్‌‌‌‌లో ఫలవంతమైన చర్చలు జరిగాయని, త్వరలోనే ఆ విషయాలను కిషన్ రెడ్డి వెల్లడిస్తారని సిబ్బంది తెలిపారు. కాగా, రాష్ట్రానికి మేలు చేసే అంశాలపైనే గడ్కరీతో కిషన్ రెడ్డి చర్చలు జరిపే ఉంటే, ఆ భేటీ గురించి రహస్యంగా ఉంచడం ఎందుకని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుపై చర్చ జరిగితే, ఆ వివరాలను దాచడం అనుమానాలను రేకేత్తిస్తున్నది.