ఇంకా బ్రిటిష్​ చట్టాలు ఎందుకు?: కిషన్ రెడ్డి

ఇంకా బ్రిటిష్​ చట్టాలు ఎందుకు?: కిషన్ రెడ్డి


హైదరాబాద్, వెలుగు: ఇంకా దేశంలో బ్రిటిష్ చట్టాలనే అనుసరిస్తున్నామని, వాటినే ఎందుకు కొనసాగించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో మార్పు కోసమే చట్టాలని, ఇప్పుడు కొన్ని చట్టాలు మార్చుకున్నామని, ఇంకా కొన్ని చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉందని తెలిపారు. మనకు స్వయంగా చట్టాలను తయారు చేసుకునే ఆలోచన, శక్తి లేదా అని ప్రశ్నించారు. ‘‘మార్పులు జరిగినప్పుడు అది సమాజానికి, దేశానికి మంచిదా కాదా అనేది ఆలోచించాలే తప్ప గుడ్డిగా వ్యతిరేకించే దుర్మార్గపు ఆలోచన దేశంలో కొనసాగుతున్నది. ఇది మంచిది కాదు” అని ఆయన అన్నారు. 

హైదరాబాద్​ నారాయణగూడలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో ఆదివారం ఫోరం ఫర్  నేషనలిస్ట్​  థింకర్స్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్ షాప్​లో కిషన్​రెడ్డి మాట్లాడారు. 2019లో తాను ఎంపీగా గెలిచినప్పుడు చాలామంది లాయర్లు.. ఐపీసీ, సీఆర్పీసీ మార్చాలని కోరారని తెలిపారు. ప్రధాని నరేంద్ర0 మోదీ చేసే చాలా పనులను కొందరు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని, అందుకే మనం వెనుకబడిపోయామన్నారు. ప్రస్తుతం దేశంలో వస్తున్న మార్పులకు, పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టు  యువతకు కావాల్సిన, దేశానికి మంచి చేయాల్సినవిధంగా చట్టాలను మార్చుకోవాల్సి ఉందన్నారు. పెద్దనోట్లను రద్దు చేసినప్పుడు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయని.. కానీ దీనిద్వారా ఐఎస్ఐ యాక్టివిటీని దెబ్బతీశామని అన్నారు. కాగా, అడ్వకేట్ ఏపీ సురేష్ రచించిన 'న్యూ క్రిమినల్ మేజర్ యాక్ట్స్' పుస్తకాన్ని సీనియర్ అడ్వకేట్​, ఎంపీ  రఘునందన్ రావు, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి రిలీజ్ చేశారు.

 
పరిశోధనలకు హైదరాబాద్ కేంద్ర బిందువు

పరిశోధన, నూతన ఆవిష్కరణలు, సాంకేతికత అభివృద్ధికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తాజ్ కృష్ణలో  జరిగిన వాణిజ్య వ్యాపారవేత్తల ఆత్మీయ సదస్సులో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ తో కలిసి కిషన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో తయారైన వ్యాక్సిన్ యావత్ ప్రపంచంలో కొవిడ్ భయాన్ని తొలగించిందన్నారు.

ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డి

ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను గతంలో కేసీఆర్​ చేర్చుకున్నట్టే, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా అట్లనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు దొందు దొందేనని, రెండూ అవినీతి పార్టీలేనని ఆయన ఆరోపించారు. ఆదివారం బంజారాహిల్స్ లో ఖైరతాబాద్ సెగ్మెంట్ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్​రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు.