
- సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ నినాదంతో ముందుకు: కిషన్రెడ్డి
- అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న కేంద్రమంత్రి
- బీజేపీ ఆఫీసులో ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబురాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సమస్యల పరిష్కారానికి చర్చించేందుకు సిద్ధమే, కానీ పనికిరాని ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ’ అనే నినాదంతో ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్పారు. బీజేపీ అభ్యర్థుల విజయం తెలంగాణ సమాజం, ఆత్మబలిదానాలు, ఉద్యోగులు, టీచర్లు, పట్టభద్రులదలకే అంకితమన్నారు. ఈ విజయాన్ని తాము మరింత బాధ్యతగా భావిస్తూ భవిష్యత్ లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడంతో గురువారం బీజేపీ ఆఫీసులో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. గెలిచిన అభ్యర్థులు మల్కా కొమరయ్య, అంజిరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో 37 శాతం మంది బీజేపీకి మద్దతు ఇచ్చారని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ అని భావిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించామని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోని రెండు కీలక స్థానాలను కైవసం చేసుకున్నామని వివరించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మోసం చేయడం, తప్పుడు ఆరోపణలు, వితండవాదం, తప్పించుకునే ప్రయత్నాలను తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. అయినా ప్రజలు సీఎం మాటలు, ఆరోపణలను ఏనాడూ పట్టించకోలేదన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలనైనా హామీలను నెరవేర్చక ఎదురుదాడులకు దిగుతున్నారని, బీజేపీపై ఆరోపణలను నెడుతున్నారని మండిపడ్డారు.
కానీ ప్రజా తీర్పు చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పదేండ్లు తనదే అధికారమని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రానున్న రోజులలో పోరాటాలకు సమాయత్తం అవుతారని వెల్లడించారు. కాంగ్రెస్ రెఫరెండమా, వైఫల్యమా? ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఇప్పటికైనా అన్ని హామీలను అమలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.