మజ్లిస్ రజాకార్ల పార్టీ : కిషన్‌‌‌‌ రెడ్డి​

మజ్లిస్ రజాకార్ల పార్టీ : కిషన్‌‌‌‌ రెడ్డి​
  • ఎన్నికల్లో ఎంఐఎంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపినయ్: కిషన్‌‌‌‌ రెడ్డి​
  • స్వార్థ రాజకీయాల కోసం ఆ పార్టీలు మజ్లిస్‌‌‌‌ మోచేతి నీళ్లు తాగుతున్నాయని మండిపాటు

హైదరాబాద్, వెలుగు: మజ్లిస్ రజాకార్ల పార్టీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆనాడు తెలంగాణలో వేలాది మంది రైతులు, కూలీలను రజాకార్లు హత్య చేశారని గుర్తుచేశారు. చెన్నారెడ్డిని సీఎం పీఠం నుంచి దించేందుకు మజ్లిస్ పార్టీ పాతబస్తీలోని తీగలకుంటలో 400 మందిని ఊచకోత కోసింది వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్నాయని విమర్శించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో కిషన్‌‌‌‌ రెడ్డి మాట్లాడారు. 

హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, మజ్లిస్ మాత్రమే అభ్యర్థులను నిలబెట్టాయని, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా బీఆర్ఎస్ పార్టీ తమ సొంత కార్పొరేటర్లను బెదిరించడం.. వారికి ఓటు వేసిన ప్రజలను అవమానించినట్లేనన్నారు. మజ్లిస్ పార్టీతో చేతులు కలిపిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎలా సెక్యులర్ పార్టీలని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజలు గత కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారని గుర్తుచేశారు. కార్పొరేటర్లను బెదిరించి, ఓటింగ్‌‌‌‌కు రాకుండా బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను అవమానిస్తున్నదని ఆరోపించారు. 

ఈ ఎన్నికల్లో గెలుపు మాదే..

హిందూ దేవుళ్లను అవమానించే మజ్లిస్‌‌‌‌ని ఎందుకు గెలిపిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని కిషన్‌‌‌‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రెండు పార్టీలకు సూపర్ బాస్ అసదుద్దీన్ ఒవైసీ అని చెప్పారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లు అయిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సమావేశమై చర్చించామన్నారు. అలాగే, బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు తమ పార్టీతో పాటు ఇతర పార్టీలకు చెందిన ఓటర్లను కలిసి మద్దతు కోరినట్టు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే తాము ముందుకెళ్తున్నామని తెలిపారు.