పదేండ్లకు పనులు పూర్తి

  • ఇక మెదక్ నుంచి రైళ్ల రాకపోకలు
  • నేడు మెదక్–అక్కన్నపేట రైల్వే లైన్​ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మెదక్, వెలుగు: ఎన్నో ఏండ్ల ఎదురుచూపుల తరువాత మెదక్ పట్టణం నుంచి రైళ్ల రాకపోకలు మొదలు కానున్నాయి. శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి మెదక్-–అక్కన్నపేట మధ్య కొత్తగా నిర్మించిన బ్రాడ్​ గేజ్​ రైల్వే లైన్​ ను జాతికి అంకితం చేయనున్నారు. జెండా ఊపి మెదక్–కాచిగూడ ప్యాసింజర్​ రైలును ప్రారంభిస్తారు. చారిత్రక, పర్యాటక వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న మెదక్ ప్రాంతానికి ఇన్నాళ్లు రైల్వే సదుపాయం లేకపోవడం లోటుగా ఉండేది. ఇందిరా గాంధీ 1982లో మెదక్ లోక్​ సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి ఇక్కడ రైల్వే సౌకర్యం కల్పించాలనే డిమాండ్ మొదలైంది. అందుకోసం దశాబ్దాలుగా అనేక ఉద్యమాలు జరిగాయి. ముఖ్యంగా రైల్వే సాధన సమితి మెదక్ నుంచి మొదలు కుని ఢిల్లీ వరకు అనేక పోరాటాలు చేసింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నసమయంలో 2012–13 రైల్వే బడ్జెట్ లో మెదక్–అక్కన్నపేట రైల్వే లైన్​ కు ఆమోదం లభించింది. 

మూడు స్టేషన్లు...

అక్కన్నపేట నుంచి మెదక్ వరకు 17.2 కిలో మీటర్ల దూరం బ్రాడ్ గేజ్​ రైల్వే లైన్, ఒకచోట రైల్వే అండర్​ బ్రిడ్జి, రెండు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి, 40 చిన్న బ్రిడ్జీలతో, రామాయంపేట మండలం లక్ష్మాపూర్, హవేలీఘనపూర్​ మండలం శమ్నాపూర్​, మెదక్​ పట్టణంలో రైల్వే స్టేషన్లు నిర్మించారు. ప్యాసింజర్​ రైళ్లతోపాటు, గూడ్స్​ రైళ్ల రాకపోకలకు వీలుగా మెదక్​ స్టేషన్​లో మూడు ట్రాక్​లు, ప్లాట్​ఫారాలు నిర్మించారు. సౌత్​ సెంట్రల్​ రైల్వే అధికారులు పలుమార్లు ట్రయల్ ​రన్ ​నిర్వహించి రైల్లు నడిపేందుకు ఓకే చెప్పారు. మెదక్ స్టేషన్​లో రైల్వే ర్యాక్​పాయింట్ కూడా మంజూరు కాగా, దాదాపు రెండు నెలల కింద అది ప్రారంభమైంది. అలాగే ప్రయాణికుల రాకపోకలకు వీలుగా మెదక్ స్టేషన్​ నుంచి రెండు ప్యాసింజర్​ రైళ్లు నడపాలని సౌత్​ సెంట్రల్​ రైల్వే అధికారులు నిర్ణయించారు.  ఈ మేరకు సౌత్​ సెంట్రల్ రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హరీశ్​రావు, జడ్పీ చైర్​పర్సన్​హేమలత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి పాల్గొననున్నారు.

పదేండ్లకు పనులు పూర్తి

కాస్ట్ షేరింగ్ సిస్టంలో ఈ ప్రాజెక్ట్​ చేపట్టాలని నిర్ణయించగా, 17.2 కిలోమీటర్ల దూరం బ్రాడ్​ గేజ్​ రైల్వేలైన్ నిర్మాణానికి రూ.117 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అవసరమైన భూమి సేకరించి ఇచ్చేందుకు, 50 శాతం ఫండ్స్​ మంజూరుకు అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వం ఆమోదం తెలుపగా, 2014 జనవరిలో రైల్వేలైన్​ నిర్మాణానికి అప్పటి మెదక్ ఎంపీ విజయశాంతి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్​ఎస్​ ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయగా, 2015లో కొత్త రైల్వేలైన్​ నిర్మాణ పనులు మొదలయ్యాయి. రాష్ట్ర వాటా నిధుల మంజూరులో జాప్యంతో పనులు ఆగుతూ, సాగడంతోపాటు అంచనా వ్యయం రూ.206 కోట్లకు చేరింది. దశల వారీగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు విడుదల చేయడంతో ఎట్టకేలకు పనులు పూర్తయ్యాయి.