మునుగోడులో భారీ మెజారిటీతో గెలుస్తామని కేఏ పాల్ ధీమా

చౌటుప్పల్ వెలుగు: మునుగోడు ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో తాను గెలుస్తున్నానని, ఇక మునుగోడును అమెరికాలా అభివృద్ధి చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ఇండిపెండెంట్అభ్యర్థి డాక్టర్ కేఏ పాల్​ అన్నారు. మంగళవారం చౌటుప్పల్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మునుగోడులో తాను గెలుస్తున్నానని తెలిసే జేపీ నడ్డా ఆయన సభను రద్దు చేసుకున్నాడన్నారు.

తాను గెలిచిన ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తానని, దీంతో ఎకరం రూ.మూడు కోట్లు అవుతుందన్నారు.  ఆ అభివృద్ధిని చూసి 119 నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీని ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను ఒక దళిత అమ్మాయిని పెండ్లి చేసుకున్నానని, దళితుల బాధలు తనకే తెలుసన్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారని, వారికి దళితుల కష్టాలు తెలియవన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు  లాంటి ప్రధానులే తన సలహాలు తీసుకునే వారన్నారు. కేసీఆర్ ఫ్లెక్సీలకు పెట్టిన ఖర్చులో ఒక శాతం నిధులు పెడితే మునుగోడు అభివృద్ధి అవుతుందన్నారు.