కుమ్రం భీం స్ఫూర్తితో.. మళ్లీ ఉద్యమించాలె

కుమ్రం భీం స్ఫూర్తితో.. మళ్లీ ఉద్యమించాలె
  • కుమ్రం భీం జయంతి నేడు 

ఆదివాసీలు మొదటి నుంచీ ప్రకృతిపై, వారు నివసించే ప్రాంతాలపై సార్వభౌమత్వానికి ఎవరు అడ్డు వచ్చినా ఒప్పుకోరు. ఆ కోవకు చెందిన యోధుడే కుమ్రం భీం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, దేశ స్వాతంత్ర్య ఉద్యమం నడుస్తున్న రోజుల్లోనే తమ ప్రాంత విముక్తి కోసం పోరాడిన అడవి సూర్యుడు ఆయన. భీం పోరాట స్ఫూర్తితోనే ఆదివాసులు, గిరిజనులు తమ ఉనికి కోసం, స్వయం పాలన కోసం, రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తున్నారు. ఆయన వారసత్వంతోనే దొరల పాలనకు వ్యతిరేకంగా అనేక మంది గిరిజనులు, ఆదివాసులు అడవిబాట పట్టి తుపాకులందుకున్నారు. ఒక దశలో ఉత్తర తెలంగాణలో సమాంతర ప్రభుత్వం నడిచింది. 
తిరుగుబాటుకు కారణాలు..
నిజాం పాలన నేరుగా ఆదివాసీ ప్రాంతాల్లోకి చొరబడలేదు. నిజాం అండతో దేశ్ ముఖ్, దేశ్ పాండేలు, మొఖాసీలు ప్రవర్తన గోండులను ఇబ్బందులకు గురి చేసింది. గోండుల సంస్కృతి ప్రకారం ప్రకృతి వనరులైన నీరు, భూమి, అడవి గ్రామ ఆస్తి, వాటి నిర్వహణ, అధికారం, బాధ్యత గ్రామ కుల పంచాయతీలదే. నిజాం రెవెన్యూ విధానాలతో భూపాలన నిజాం ప్రభుత్వం నియమించిన గ్రామాధికారి, పై అధికారులదే అయింది. నిజాం వ్యవస్థ కారణంగా స్వతంత్రులుగా ఉన్న గోండు రాజులు రెవెన్యూ అధికారులకు సహాయకులుగా, బానిసలుగా మారాల్సి వచ్చింది. గోండుల జీవన విధానంలో పెద్ద వ్యాధి వచ్చినప్పుడు, వరదలొచ్చినప్పుడు, అడవి జంతువుల దాడి బాగా జరిగినప్పుడు తాత్కాలికంగా ఊరొదిలి వెళ్తారు. అలా వెళ్లిన పలు సందర్భాల్లో వారు తిరిగి వచ్చేసరికి జమీందారులు, రెవెన్యూ అధికారులు ఆదివాసీల భూమిని కబ్జా పెట్టేవారు. వివిధ కారణాలతో సాగు చేయకుండా ఉన్న గిరిజనుల భూమిని రెవెన్యూ అధికారులు కాజేసేవారు. ఆదివాసీలకు పరిచయం లేని రిజర్వు ఫారెస్ట్ లు, భూమి శిస్తు, వ్యవస్థలను గిరిజనులపై రుద్ది నిజాం పాలకులు దోపిడీకి శ్రీకారం చుట్టారు. భూమి, అడవులపై యాజమాన్యం, నిర్వహణ గిరిజన తెగల నుంచి ప్రభుత్వానికి పోవడంతో ఆదివాసీల ఉనికి ప్రశ్నార్థకమైంది. అధికారుల దౌర్జన్యాలతో గిరిజనులు తమ భూమిని కోల్పోయారు. క్రమంగా అధికారులు గిరిజనులపై పన్నులు వేయడం మొదలు పెట్టారు. గోండులు సొంత ప్రాంతంలోనే ఎన్నో అవమానాలకు గురై పోరాటానికి సిద్ధమయ్యారు. 
నిజాంపై పోరాటం..
ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ లో 22 అక్టోబర్ 1901లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కుమ్రం భీం చిన్ననాటి నుంచే అన్యాయాన్ని సహించే వాడు కాదు. 15 ఏండ్ల వయసులోనే తన జాతి పడుతున్న బాధలు చూశాడు. రోగాలు, జంతువుల దాడులు, చావులు, షావుకార్ల అరాచకాలు, గూడెం మీద ఇతరుల దాడి, కరువులు, పంటలపై జంతువుల దాడులు ఇలా ప్రతీ ఒక్కటీ కళ్లారా చూస్తూ వాటి గురించి ఆలోచిస్తుండే వాడు. గోండులపై దేశ్​ముఖ్ లు, నిజాం పాలకుల దాడులను కుమ్రం సహించ లేదు. తన చుట్టూ ఉన్న 12 ఊళ్లే కాకుండా ఆదివాసీ ప్రాంతమంతా జనసమీకరణకు ప్రయత్నం చేశాడు. యుద్ధం తీవ్రమవుతున్న దశలో భీం సోదరులకు, బంధువులకు దున్నుకునే భూమికి పట్టాలిస్తామని నిజాం ఆశ చూపాడు. అయినా కుమ్రం భీం లొంగకపోవడంతో ఆయన పోరాటం చేసే పన్నెండు ఊళ్లలోనూ పట్టాలు ఇస్తామని చెప్పాడు. అయినా వినని భీం.. పన్నెండు ఊళ్లలో పట్టాలు కాదు.. ఆ ఊళ్లపై మా అధికారాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. 
మా ఊళ్లో.. మా రాజ్యం కావాలె
భీం పోరాటం మొదట్లో చాలా శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరిగింది. ఉద్యమం కీలక సందర్భంలో ఆయన అడవుల్లోకి ప్రవేశించి సాయుధ పోరాటం కొనసాగించాడు. భీం అనుచరులు తమ పోరాటంలో భాగంగా ప్రజా కంఠకులైన కొందరు అధికారులను హతమార్చారు. అధికారులపై దాడుల నేపథ్యంలో అప్పటి కలెక్టర్ భీంను చర్చలకు పిలిచాడు. ‘మా ఊళ్లో మా రాజ్యం’’ డిమాండ్ ను ఒప్పుకొని భూములను ఆదివాసులకు ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేయగా.. అందుకు కలెక్టరు ఒప్పుకోలేదు. దీంతో భీం తన పోరాటాన్ని మరింత ఉధృతం చేశాడు. 1940లో బాభిఝరి కొండల్లో నిజాం పోలీసులతో జరిగిన యుద్ధంలో కుమ్రం భీం, ఆయన అనుచరులు వీర మరణం పొందారు. కుమ్రం భీం పోరాటం నిద్రపోతున్న నిజాం ప్రభుత్వాన్ని మేలుకొల్పింది. భీం పోరాట ఫలితంగా1945 ప్రాంతంలో గిరిజనులకు సుమారు ఒక లక్ష అరవై వేల ఎకరాల అటవీ భూములకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. కుమ్రం భీం అమరుడై ఆదివాసీల, పీడిత ప్రజల జీవితాల్లో కాంతి కోసం ఉద్యమాన్ని ఆయుధంగా ఇచ్చి వెళ్లాడు. ఎంతో మంది ఆత్మ బలిదానాలతో కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు. సబ్బండ వర్గాలు బాగుపడే తెలంగాణ రాలేదు. పీడిత ప్రజలకు, ఉద్యమకారులకు కుమ్రం భీం పోరాట స్ఫూర్తి నేటి ఉద్యమ అవసరంగా తీసుకోవాలి. 

ఆదివాసీలు, గిరిజనుల జీవన విధానం వేరు. ప్రకృతిపై ఆధారపడి జీవించే వారు అటవీ సంపదను కాపాడటంలో ముందుంటారు. కానీ పాలకులు వారి ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా.. భూములు లాక్కోవడం, పంటలు ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా జీవిస్తున్న తమ జాతిపై నిజాం సర్కార్ జులుం ప్రదర్శిస్తూ.. స్వేచ్ఛను హరించిన తీరును సహించని కుమ్రం భీం తన జాతిని కాపాడుకోవడానికి ఆయుధం పట్టి తిరగబడ్డాడు. తన శక్తి చిన్నదని తెలిసినా.. జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంలో వెనకడుగు వేయలేదు. జల్, జంగల్, జమీన్ నినాదంతో కుమ్రం భీం పోరాటం చేస్తే..  నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ యువత ప్రాణాలకు తెగించి ఉద్యమం చేసింది. అయినా.. స్వరాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసీలు, పేదల బతుకులు మారడం లేదు. అభివృద్ధి, సామాజిక తెలంగాణ కోసం కుమ్రం భీమ్​ స్ఫూర్తితో అన్ని వర్గాలు మరో పోరాటం చేయాల్సిన అవసరముంది.

పోరాటం కొనసాగుతోంది
8 దశాబ్దాల క్రితం స్వపరిపాలన కోసం కుమ్రం భీం చేసిన పోరాటం తెలంగాణలో ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ వస్తే సాధారణ ప్రజలతోపాటు ఆదివాసీలకు కూడా విముక్తి జరుగుతుందని, స్వయం పాలనకు దారులు పడతాయని ఆశించి గిరిజనులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. కాగా తెలంగాణ ఏర్పాటు తర్వాత అడవి బిడ్డల సమస్యలు తీరకపోగా మరింత పెరుగుతున్నాయి. సీమాంధ్ర పాలకులతో వీరోచిత పోరాటం చేసి సాధించుకున్న వనరులను నేటి తెలంగాణ పాలకులు వివిధ కారణాలతో లాక్కోవాలనుకోవడం బాధాకరం. 30 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిపై ప్రజలకు హక్కు లేదంటున్నారు. 
అటవీ ప్రాంతాల్లో మరిన్ని కొత్త 
సమస్యలు వచ్చాయి. మానవాళి మనుగడకు ఎంతో అవసరమైన అటవీ సంపదను కాపాడటంలో ఆదివాసీలది కీలకపాత్ర. ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా లభించిన వనరులతో వారిని వారు పోషించుకుంటూ అడవి తల్లిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అలాంటి ఆదివాసీలకు కొత్త సమస్యలు 
తెచ్చి పెట్టడం సరికాదు.