ఖైరతాబాద్, వెలుగు: తమ తాత ముత్తాతల నుంచి నివసిస్తున్న స్థలాలను అపర్ణ నిర్మాణ సంస్థ అక్రమంగా స్వాధీనం చేసుకుందని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని కొడంకల్ తండా వాసులు ఆరోపించారు. అంతేకాకుండా తమను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంస్థపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తండా వాసులు గురువారం మాట్లాడారు. గ్రామానికి చెందిన సర్వే నంబరు 362,363,364,377లోని తమ భూములను అపర్ణ నిర్మాణ సంస్థ గత ప్రభుత్వంలోని మాజీ మంత్రులను అడ్డుపెట్టుకుని కబ్జా చేసిందని ఆరోపించారు.
మిర్సాంబ్ కుంట, వల్లభస్వామి కుంట, బిళ్లాదకల భూములు, గిరిజనుల అసైన్డ్ భూములను కబ్జాచేసి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చి వేయాలన్నారు. స్మశాన వాటికను కూడా ధ్వంసం చేశారన్నారు. సంస్థ ఆకృత్యాలను ప్రశ్నించిన తండా యువకులపై శంకర్పల్లి, మోకిల పోలీసు స్టేషన్లలో 8 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యపై దృష్టి సారించి, తమ భూములు తమకు ఇప్పించాలని కోరారు.