కౌడిపల్లి, వెలుగు: మూడు నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు రాక తిప్పలు పడుతున్నామని మండలంలోని శేరితండా పంచాయతీ కొర్రతండా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను నిరసిస్తూ బుధవారం ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన తెలిపారు. తండాలో 50 కుటుంబాలు ఉండగా, 180 జనాభా ఉందని నల్లా నీళ్లు సరిగా రాక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌడిపల్లి కి వెళ్లి వాటర్ ప్లాంట్ నుంచి నీళ్లు కొనుక్కొని తెచ్చుకుంటున్నామని వాపోయారు.
అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కరించడం లేదని విమర్శించారు. ఈ విషయమై మిషన్ భగీరథ సూపర్వైజర్ అనిల్ కుమార్ ను వివరణ కోరగా నీటి సమస్య ఉన్న మాట వాస్తవమేనన్నారు. నీటి ఫ్లో ఎక్కువగా వస్తేనే తండాకు నీరు వెళ్లే అవకాశం ఉందని, సమస్యను మూడు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు.