ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.27,500 జరిమానా

ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.27,500 జరిమానా

కోటగిరి, వెలుగు : ఉమ్మడి కోటగిరి మండలంలో ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, జీపీ సెక్రటరీల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అధికారులు రూ.27,500 జరిమానావిధించారు.  సోమవారం  కోటగిరి మండల ఎంపీడీవో కార్యాలయంలో డీఆర్డీవో పీడీ సాయాగౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.  28 గ్రామాల్లో జరిగిన సోషల్ ఆడిట్ నివేదికను ఆడిట్ బృందం డీఆర్డీవో ఎదుట చదివి వినిపించారు. ప్రతి పల్లెలోనూ  రికార్డులు, మస్టర్ల నిర్వహణలో ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్లక్ష్యం కనిపించడంతో అధికారులు మండిపడ్డారు. 

ఆయా గ్రామాల్లో నర్సరీల రిపోర్టులు సరిగ్గా లేవని, నాటిన మొక్కలను ఎందుకు సంరక్షించలేదని ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రశ్నించారు. కొడిచర్ల గ్రామంలో 2600 మొక్కలు నాటితే కేవలం రెండు వందల మొక్కలు మాత్రమే ఉన్నాయన్నారు. జల్లాపల్లి ఫారం గ్రామంలో ఒకరు పని చేస్తే మరొకరికి పేమెంట్లు చేశారని, అంగన్​వాడీ ఆయాగా పని చేసే వ్యక్తికి పేపెంట్లు చేసినట్లు ఆడిట్ బృందం డీఆర్డీవో దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఫైన్​ వేయడంతోపాటు  రూ.5500 రికవరీకి నోటీసులు జారీ చేశారు.  కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ సాయాగౌడ్, స్టేట్ ఆఫీసర్ ఆజాద్ అలీ, డిస్ట్రిక్ట్​విజిలెన్స్ ఆఫీసర్ నారాయణ, సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి  రాజశేఖర్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో చందర్, ఏపీవోలు, గంగారాం, రమణ, పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.