మంచి జీవితం, జీతం కోసమే.. ఇండియా నుంచి వెళ్లిపోతున్నం

మంచి జీవితం, జీతం కోసమే.. ఇండియా నుంచి వెళ్లిపోతున్నం

ఇండియాను విడిచి పెట్టి విదేశాల్లో సెటిల్ అవ్వాలని చాలా మంది ధనవంతులు చూస్తున్నారు. ఇక్కడితో పోలిస్తే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో  జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండడం, సులభమైన వ్యాపార వాతావరణం, మెరుగైన  ఎడ్యుకేషన్ కోసం వలస బాట పడుతున్నారు.   ఇండియాలోని  కనీసం 22 శాతం మంది సూపర్ రిచ్ ఇండియన్లు  దేశాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటున్నారని వెల్త్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ  కోటక్ ప్రైవేట్  సర్వే బుధవారం ప్రకటించింది. కన్సల్టెన్సీ ఈవైతో కలిసి ఈ సర్వేను చేపట్టింది. 

ఇందుకోసం  150 మంది అల్ట్రా హై నెట్‌‌‌‌‌‌‌‌వర్త్ (యూఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌)  వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించింది.  యూఎస్‌‌‌‌‌‌‌‌, యూకే, ఆస్ట్రేలియా, కెనడా,  గోల్డెన్ వీసా స్కీమ్‌‌‌‌‌‌‌‌ వలన యూఏఈ..ఈ దేశాలు ఇండియన్ ధనవంతులను ఆకర్షిస్తున్నాయి.  కాగా  ప్రభుత్వ డేటా ప్రకారం, ప్రతి  ఏడాది సుమారు 25 లక్షల మంది ఇండియన్లు  ఇతర దేశాలకు వలస వెళ్తున్నారని అంచనా.  ‘సర్వే చేసిన ప్రతి ఐదు మంది అల్ట్రా హెచ్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఐల (ధనవంతుల) లో ఒకరు విదేశాలకు వలస వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు లేదా  అదే పనిలో ఉన్నారు.  వీరిలో చాలా మంది విదేశాల్లో ఉంటూనే  తమ భారతీయ పౌరసత్వాన్ని కొనసాగించాలని చూస్తున్నారు’ అని కోటక్ సర్వే వెల్లడించింది. 

Also Read:-శుభవార్త.. దిగొచ్చిన టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్.. ఆ ట్రైనీలకు కొత్త జాబ్ ఆఫర్..

మెరుగైన జీవితం కోసమే..

చాలా మంది ధనవంతులు మెరుగైన జీవితం కోసమే విదేశాల్లో స్థిరపడాలని కోరుకుంటున్నారు. మెరుగైన హెల్త్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌లు, విద్య, క్వాలిటీ లైఫ్‌‌‌‌‌‌‌‌ను అందించే దేశాలకు షిఫ్ట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఇండియాను  విడిచి పెట్టాలని చూస్తున్న ధనవంతుల్లో  రెండొంతుల మంది బిజినెస్ ఈజీగా చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే విదేశాలకు వలస వెళుతున్నారు.  అంతేకాకుండా తమ  పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు కూడా వలసబాట పడుతున్నామని తెలిపారు.  

ప్రొఫెషనల్సే ఎక్కువ పోతున్నారు..

వ్యాపారులతో  పోలిస్తే  ప్రొఫెషనల్స్ (డాక్టర్లు, ఇంజనీర్లు మొదలైనవారు)  విదేశాల్లో సెటిల్ అవ్వడానికి  ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కోటక్ ప్రైవేట్ సర్వే ప్రకారం, వయస్సు వారీగా చూస్తే 36–-40 ఏళ్లు,  61 ఏళ్లకు  పైబడిన ధనవంతులే  వలస వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాగా,  2023 నాటికి నికర సంపద రూ.25 కోట్ల కంటే ఎక్కువ ఉన్న ధనవంతుల సంఖ్య  2.83 లక్షలకు పెరిగింది.  వీరి మొత్తం సంపద రూ.283 లక్షల కోట్లుగా ఉంది.   2028 నాటికి వీరి సంఖ్య  4.3 లక్షలకు చేరుకుంటుందని అంచనా. వీరి మొత్తం సంపద రూ. 359 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది.   వినియోగం పుంజుకోవడం, బలమైన ఆర్థిక వృద్ధి తోడ్పాటుతో ఇండియాలో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది.