
కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పట్టణ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఈనెల 15న హత్యకు గురైన వృద్ధురాలి కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు కొత్తపల్లి ఎస్‌హెచ్‌వో, ప్రొబేషనరీ ఐపీఎస్ వసుంధర యాదవ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌కు చెందిన తనుకు వెంకటమ్మ(70)కు కొడుకులు లేకపోవడంతో బిడ్డ కొడుకు చంద్రశేఖర్(31)ను కొన్నేండ్ల కింద దత్తత తీసుకుంది. చంద్రశేఖర్‌కు నాలుగేండ్ల కింద పెండ్లి చేసింది. తన వద్ద ఉన్న బంగారం, డబ్బులు బిడ్డలకే ఇస్తున్నావని, నిత్యం ఆమెతో గొడవపడేవాడు.
అనంతరం ఏడాదిగా భార్యతో కలిసి కరీంనగర్ లో అద్దెకు ఉంటుండగా.. వెంకటమ్మ కోహెడ మండలం రామచంద్రపూర్ లో ఉన్న బంధువుల వద్దకు వెళ్లి ఉంటోంది. ఈ నెల 15న చంద్రశేఖర్.. వెంకటమ్మకు ఫోన్ చేసి ఎల్ఐసీ డబ్బులు వచ్చాయని కరీంనగర్ రావాలని చెప్పడంతో ఆమె కరీంనగర్ వెళ్లింది. తన స్నేహితుడి వద్ద కారు తీసుకున్న చంద్రశేఖర్.. అమ్మమ్మ బస్సు దిగగానే జగిత్యాల వెళ్లి డబ్బులు తీసుకురావాలని కారు ఎక్కించుకున్నాడు.
అనంతరం అక్కడ అధికారులు అందుబాటులో లేరని చెప్పి సాయంత్రం తిరిగి బయలుదేరారు. అమ్మమ్మను చంపాలని ప్లాన్ వేసుకున్న అతను కొత్తపల్లి శివారు ఎస్సారెస్పీ కెనాల్ వద్దకు చేరుకోగానే తనకు టాయిలెట్ వస్తుందని కారు ఆపి ఆమెను కూడా దిగమని చెప్పాడు. మూత్రవిసర్జన చేస్తున్నట్లు నటించి వెనుక నుంచి మెడ, గదువ భాగంలో కత్తితో నరికాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడే చనిపోయింది. అనంతరం చంద్రశేఖర్ కారును తన స్నేహితుడికి అప్పగించి వరంగల్ వెళ్లాడు. రెండు రోజులుగా పోలీసులు గాలించి సోమవారం 17న రాత్రి అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.