- ఈ నెల 14 నుంచే అమలు కావాల్సిన కృష్ణా, గోదావరి బోర్డుల జ్యూరిస్‌డిక్షన్
- ఔట్‌లెట్లు అప్పగిస్తూ ఏపీ ఉత్తర్వులు
- అప్పగింతపై స్టడీకి కమిటీ వేసిన తెలంగాణ
- ఎటూ తేలకపోవడంతో కేంద్రం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న బోర్డులు
హైదరాబాద్, వెలుగు: గెజిట్ నోటిఫికేషన్ అమలుపై కృష్ణా, గోదావరి బోర్డులు అయోమయంలో ఉన్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచే జ్యూరిస్‌డిక్షన్ అమలు కావాల్సి ఉన్నా ఇంకా డైలామానే కొనసాగుతోంది. కృష్ణా, గోదావరిలో కామన్ ప్రాజెక్టులతో మొదలుపెడతామని బోర్డులు చెప్పగా.. తొలుత నిర్ణయించిన ఔట్‌లెట్లను అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులిచ్చింది. కానీ తెలంగాణ మాత్రం ఔట్‌లెట్ల అప్పగింతపై నిర్ణయం తీసుకోకుండా స్టడీ చేసేందుకు కమిటీ వేసింది. తెలంగాణ క్లారిటీ ఇవ్వకపోవడం, క్లారిటీ ఇచ్చిన ఏపీ కూడా పూర్తి స్థాయిలో సహకరించకపోవడంతో గెజిట్ అమలుపై ఎటూ తేలక కేంద్రం ఆదేశాల కోసం బోర్డులు ఎదురు చూస్తున్నాయి.
3 షెడ్యూళ్లలో రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ కేంద్ర జలశక్తి శాఖ జులై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది ఈ నెల 14 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. గెజిట్ నోటిఫికేషన్‌లో రెండు రాష్ట్రాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, హైడల్ పవర్ స్టేషన్లను 3 షెడ్యూళ్లలో చేర్చారు. మొదటి షెడ్యూల్‌లో మొత్తం ప్రాజెక్టుల పరిధిలోని ఔట్‌లెట్లను పేర్కొన్నారు. రెండో షెడ్యూల్‌లోని ప్రాజెక్టులను ఆయా బోర్డులు నిర్వహణలోకి తీసుకుంటాయని క్లారిటీ ఇచ్చారు. మూడో షెడ్యూల్‌లోని ప్రాజెక్టులను ఆయా రాష్ట్రాలే నిర్వహించుకోవాలని స్పష్టతనిచ్చారు. రెండో షెడ్యూల్‌లో కృష్ణా నదిపై ఉన్న 12 ప్రాజెక్టుల్లోని 63 కాంపోనెంట్స్, గోదావరి నదిపై గల 16 ప్రాజెక్టుల్లోని 33 కాంపోనెంట్స్ ఆయా బోర్డుల నిర్వహణలోకి వెళ్లాల్సి ఉంది. కానీ 2 రాష్ట్రాలు.. ప్రాజెక్టులను బోర్డులకు ఇచ్చేందుకు ససేమిరా అన్నాయి. అయితే పలుమార్లు సంప్రదింపులు, ఫుల్ బోర్డు మీటింగుల్లో చర్చల తర్వాత గోదావరి బోర్డు పరిధిలోకి రెండు రాష్ట్రాలకు కామన్ ప్రాజెక్టుగా ఉన్న పెద్దవాగును బోర్డు నిర్వహణకు అప్పగించాలని నిర్ణయించారు. కృష్ణాలో కామన్ ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని డైరెక్ట్ ఔట్‌లెట్ల అప్పగింతకు ఓకే చెప్పారు.
పంచాయితీలు మస్తుగున్నయ్
ఏపీ ప్రభుత్వం తమ పరిధిలోని ఔట్‌లెట్లను అప్పగిస్తూ ఈ నెల 14, 15 తేదీల్లో వేర్వేరుగా ఉత్తర్వులిచ్చింది. తమ ఔట్‌లెట్లను ఇస్తూనే తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తీసుకోవాలని మెలిక పెట్టింది. జూరాల సైతం బోర్డు నిర్వహణలోనే ఉండాలంది. తెలంగాణ పవర్ హౌస్‌లన్నీ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. పవర్ హౌస్‌లు ఇవ్వడానికి తెలంగాణ ససేమిరా అంటోంది. పవర్ హౌస్‌ల పంచాయితీ తేలకుండా ఔట్‌లెట్లు బోర్డుల నిర్వహణలోకి వెళ్లే చాన్స్ లేదు. వీటిపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తేవడంలో రెండు బోర్డులు విఫలమయ్యాయి. ఫలితంగా గెజిట్ అమలు ప్రశ్నార్థకమైంది. తెలంగాణ ఔట్‌లెట్లను బోర్డుకు అప్పగించడంపై స్టడీ చేయడానికి ఎక్స్‌పర్ట్ కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు చేపడుతామంది. దీంతో నెలాఖరు వరకు గెజిట్ అమలయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఆ తర్వాత కూడా ఔట్‌లెట్లను రాష్ట్రాలు అప్పగిస్తే తప్ప బోర్డులు వాటిని నిర్వహణకు తీసుకోవడానికి అవకాశం లేదు. దీంతో మొత్తానికి గెజిట్ అమలవుతుందా లేదా తేలట్లేదు. కేంద్రం నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తప్ప బోర్డులు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది.