కృష్ణ, తుంగభద్ర నదులకు వరద

కృష్ణ, తుంగభద్ర నదులకు వరద
  • జూరాలకు 7211 క్యూసెక్కుల రాక 
  • ప్రస్తుతం 4.94 టీఎంసీల నీళ్లు నిల్వ 

గద్వాల, వెలుగు: కర్ణాటక ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయకపోయినప్పటికీ అక్కడ కురుస్తున్న వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులకు వరద వస్తోంది. ప్రస్తుతం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు స్వల్ప వరద మొదలైంది. జూరాల ప్రాజెక్టు క్యాచ్ మెంట్ ఏరియాతో పాటు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర 4. 94 టీఎంసీల నీళ్లున్నాయి. 

7211 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తున్నది. అదేవిధంగా కర్ణాటకలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదికి స్వల్ప వరద వచ్చి చేరుతోంది. వరద నీరు ఆర్డీఎస్ మీదుగా మంగళవారం మండలంలోని పులికల్ సమీపంలో ఉన్న నాగల దిన్నె బ్రిడ్జి వద్దకు చేరుకుంది. రెండు నెలలుగా ఒట్టి పోయిన తుంగభద్రకు వరద రావడంతో నదీ తీర గ్రామాల ప్రజలు, రైతులు ఊరట చెందారు. దీంతో పలు గ్రామాలకు తాగునీటి సమస్య తీరింది. మోటార్ల ద్వారా నది నీటితో పంటలు సాగు చేసే రైతులు వరి నారు పోసుకునేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఏరువాకకు ముందుగానే కృష్ణా, తుంగభద్రలకు వరద రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.