- 2 రాష్ట్రాలకు సమాచారంఇచ్చిన బోర్డు
- సాగర్ ఎడమ కాల్వ నుంచి 12 టీఎంసీల నీళ్లివ్వాలన్న ఏపీ..కుదరదన్న తెలంగాణ
హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) మీటింగ్ తేదీ ఖరారైంది. ఈ నెల 21న రెండు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ అధికారులకు బోర్డు అధికారులు సమాచారం పంపించారు. వాస్తవానికి నిరుడు నవంబర్లోనే సమావేశాన్ని నిర్వహించాల్సి ఉన్నా.. వివిధ కారణాలతో సమావేశం 2 సార్లు వాయిదా పడింది. గతఏడాది డిసెంబర్ 3న నిర్వహించాలని భావించినా కుదరలేదు. రెండు రాష్ట్రాలు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరడంతో బోర్డు రెండు సార్లు పోస్ట్‌పోన్ చేసింది. తాజాగా నిర్వహణ డేట్‌ను ప్రకటించింది. ఇప్పటికే రెండు రాష్ట్రాలు మీటింగ్‌లో చర్చించాల్సిన అంశాలపై ఎజెండాను పంపించాయి.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ జోన్ –3లోని ఆయకట్టుకు 12 టీఎంసీల నీటిని విడుదల చేయాలని బోర్డును ఇటీవల ఏపీ సర్కారు కోరింది. నీటిని విడుదల చేయాలంటూ తెలంగాణకు బోర్డు లేఖ కూడా రాసింది. అయితే నీటిని విడుదల చేసేది లేదని తెలంగాణ అధికారులు బోర్డుకు తేల్చి చెప్పినట్టు సమాచారం. కాగా, పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో తెలంగాణలో ఏర్పడే ముంపు సమస్యపై జాయింట్ సర్వే వాయిదా పడింది. గురువారం నుంచే సర్వే ప్రారంభం కావాల్సి ఉండగా.. సర్వేని ఈ నెల 15కి వాయిదా వేసినట్టు అధికారులు చెబుతున్నారు.