టీమిండియాకు అంత సీన్ లేదు.. ఎక్కువగా ఊహించుకుంటున్నారు: మాజీ సెలక్టర్

టీమిండియాకు అంత సీన్ లేదు.. ఎక్కువగా ఊహించుకుంటున్నారు: మాజీ సెలక్టర్

దక్షిణాఫ్రికా పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కనీస పోరాట పటిమ ప్రదర్శించకుండా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎంతో అనుభవం ఉన్న మన జట్టు ఇంత చెత్త ప్రదర్శన చేయడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లిస్టులో భారత మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా ఓటమిపై విరుచుకుపడ్డాడు. భారత జట్టును మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 

శ్రీకాంత్ మాట్లాడుతూ.." నా దృష్టిలో భారత్ టెస్టుల్లో ఓవర్‌రేటెడ్ టీమ్. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టెస్టుల్లో టీమిండియా అత్యుత్తమంగా రాణించింది. ఇంగ్లండ్‌లో ఆధిపత్యం చూపించడంతో పాటు దక్షిణాఫ్రికాలో తీవ్రంగా శ్రమించారు. అసాధ్యమనుకున్న ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచారు. ఐసీసీ ర్యాంకింగ్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కుల్దీప్ యాదవ్ లాంటి నాణ్యమైన స్పిన్నర్ ను పక్కన పెడుతున్నారు". అని శ్రీకాంత్ తన యూ ట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చాడు. 

ఈ సందర్భంగా వన్డే, T20Iలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు ఈ మాజీ సెలక్టర్.వన్డేలు ఎక్కడ ఆడినా భారత్ గన్ సైడ్ అని.. కానీ టీ20 ఫార్మాట్‌లో మాత్రం మరీ ప్రమాదకరమైన జట్టుగా భావించాల్సిన అవసరం లేదని తెలిపాడు. ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ దశలో  భారత్ ఓడిపోయినా.. ఎప్పుడూ టాప్ టీమ్ అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం శ్రీకాంత్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన భారత్.. రెండు టెస్టుల సిరీస్‍లో 0-1తో వెనుకబడింది. దీంతో రెండో టెస్టులో విజయం సాధిస్తే తప్ప సిరీస్ కాపాడుకోలేరు. ఈ మ్యాచ్ లోనూ గెలిచి  సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని సఫారీలు భావిస్తుంటే..సిరీస్ సమం చేయాలని టీమిండియా గట్టి పట్టుదలతో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.